ఇంగ్లాండ్ సారధి స్టోక్స్‌కు కొరకరాని కొయ్యలా బుమ్రా

* బుమ్రా సరికొత్త రికార్డు… యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ

భారత పర్యటనలో ఇంగ్లాండ్ సారధి బెన్ స్టోక్స్‌కు  భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా కొరకరాని కొయ్యలా మారాడు. హైదరాబాద్‌ టెస్టులో ఆడేందుకు ఏమాత్రం వీలుగా లేని అన్‌ప్లేయబుల్‌ డెలివరీతో స్టోక్స్‌కు బోల్తా కొట్టించిన బుమ్రా తాజాగా వైజాగ్‌ టెస్టులోనూ అదే మ్యాజిక్‌ రిపీట్‌ చేశాడు.  బుమ్రా వేసిన బంతికి స్టోక్స్‌.. ‘ఇక నా వల్ల కాదు. నీ బౌలింగ్‌లో నేను బ్యాటింగ్‌ చేయనురా సామి’ అంటూ బ్యాట్‌ కింద పడేసి ఏమీ చేయలేని అసహనంతో క్రీజును వదిలాడు. మ్యాచ్ రెండో రోజైన శనివారం ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ లైనప్‍ను కుప్పకూల్చాడు. 

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ జట్టు 253 పరుగులకు ఆలౌట్ కాగా భారత్‍కు భారీ ఆధిక్యం దక్కింది. కాగా, ఈ క్రమంలో బుమ్రా ఓ రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా 150 టెస్టు వికెట్లు తీసిన భారత పేసర్‌గా జస్‍ప్రీత్ బుమ్రా రికార్డు (బంతుల పరంగా) నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‍లో 6781 బంతుల్లోనే 150 వికెట్లను దక్కించుకున్నాడు. బెన్ స్టోక్స్‌ను ఔట్ చేశాక ఈ రికార్డుకు బుమ్రా చేరుకున్నాడు. 

ఉమేశ్ యాదవ్ (7661 బంతులు)ను దాటేసి వేగంగా 150 టెస్టు వికెట్లు దక్కించుకున్న భారత ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా అగ్రస్థానానికి వచ్చాడు. మహమ్మద్ షమీ (7755), కపిల్ దేవ్ (8378) మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. అలాగే, టెస్టుల్లో 10వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు జస్‍ప్రీత్ బుమ్రా.  దీంతో టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన భారత పేసర్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఈ లిస్టులో చెరో 11 సార్లతో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ ఫస్ట్ ప్లేస్‍లో ఉన్నారు. 

ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేయటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 రన్స్ చేసింది. ఇంగ్లండ్ రెండో రోజే తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండో రోజు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 28 రన్స్ చేసింది. దీంతో 171 పరుగుల ఆధిక్యానికి చేరింది.

యశస్వి జైస్వాల్ తన తొలి అంతర్జాతీయ డబుల్ సెంచరీకి చేరాడు. తన కెరీర్లో ఆరో టెస్టులోనే డబుల్ సెంచరీ చేసి గర్జించాడు 22 ఏళ్ల సంచలనం జైస్వాల్.  277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్సర్లు బాది ద్విశతకానికి చేరాడు. సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లీ తర్వాత మైలురాయిని చేరుకున్న మూడవ అతి పిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. ప్రస్తుతం భారత 380 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. క్రీజులో యశస్వి జైస్వాల్(207), కుల్‌దీప్ యాదవ్(1) ఉన్నారు.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా టీ విరామం తర్వాత బెయిర్‌ స్టో, బెన్‌ ఫోక్స్‌, రిహాన్‌ అహ్మద్‌ల వికెట్లు కోల్పోయాక టామ్‌ హర్ట్లీతో కలిసి 8వ వికెట్‌కు 47 పరుగులు జోడించి భారత్‌ చేసిన పరుగుల లక్ష్యాన్ని కరిగిస్తున్నాడు బెన్‌ స్టోక్స్‌. ఈ క్రమంలో అశ్విన్‌, కుల్‌దీప్‌, ముఖేశ్‌ కుమార్‌ ల బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కుంటున్నాడు. అయితే అప్పుడే రోహిత్‌ బుమ్రాను బరిలోకి దించాడు.

బుమ్రా వేసిన ఆ ఓవర్లో తొలి బంతికి స్టోక్స్‌ పరుగులేమీ చేయలేదు. రెండో బాల్‌ను బుమ్రా కట్టర్‌ సంధించాడు. ఆఫ్‌ స్టంప్‌ దిశగా తక్కువ ఎత్తులో వచ్చిన ఆ బంతిని స్టోక్స్‌ డిఫెండ్‌ చేయబోయాడు. కానీ అది కాస్తా మిస్‌ అయి ఆఫ్‌ స్టంప్‌ను పడగొట్టింది. అంతే స్టోక్స్‌.. వెనక్కి తిరిగి చూసుకోకుండా అక్కడే బ్యాట్‌ పడేసి ‘ఎలా ఆడాలి ఈ బాల్‌’ అన్నట్టుగా నిరాశతో వెనుదిరిగాడు.