కేజ్రీవాల్‌ విచారణకు రావడం లేదని కోర్టుకెక్కిన ఈడీ

*  మొహల్లా క్లినిక్కుల్లో అవినీతిని వెల్లడించిన ఏసీబీ
 
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సమన్లు జారీ చేసినా  ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్‌ కేజ్రీవాల్‌ విచారణకు హాజరుకాకపోవడంపై ఈడీ రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌ విచారణకు హాజరు కావటం లేదని, సమన్లు స్వీకరించటం లేదని ఇక్కడి ఓ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై ఫిబ్రవరి 7న విచారణ చేపడతామని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ దివ్యా మల్హోత్రా తెలిపారు. 
ఓ వైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ కోర్టుకు ఫిర్యాదు, మరోవైపు తాను బీజేపీపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసుల నుంచి నోటీసులు, మొహల్లా క్లినిక్కుల ల్యాబ్‌ పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఏసీబీ అధికారుల ప్రకటించడంతో కేజ్రీవాల్ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది.
మనీలాండరింగ్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు గైర్హాజరయ్యారు.
రెండు రోజుల క్రితం కేజ్రీవాల్‌కు ఈడీ ఐదోసారి సమన్లు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, చెల్లవని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఈడీ విచారణ హాజరుకాకపోవడంపై కేజ్రీవాల్‌పై బీజేపీ కార్యదర్శి బన్సూరి స్వరాజ్‌ విమర్శలు గుప్పించారు.  దర్యాప్తునకు హాజరుకాకపోవడం కేజ్రీవాల్ వైఖరి బాధ్యతారాహిత్యమని, వెళ్లకుండా వింత సాకులు చూపుతున్నారని ధ్వజమెత్తారు.
ఈడీ సమన్లు చట్టవిరుద్ధమైతే కేజ్రీవాల్ ఎందుకు కోర్టును ఆశ్రయించరని ఆయన నిలదీశారు. దేశంలోని చట్టం సామాన్యుడితో పాటు ముఖ్యమంత్రికి సమానంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధమని తేలితే కోర్టుకు వెళ్లాలని, అక్కడ నిజం బయటపడుతుందని సవాల్ చేశారు.  మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికు పలువురు ఆప్‌ నేతలు  అరెస్ట్ కాగా, నేతలు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను కోర్టులు కొట్టివేయడం గమనార్హం.
 
‘ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర’ ఆరోపణలపై నోటీసులు జారీ
 
మరోవంక, తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు ప్రయత్నిస్తోందని  కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీచేసేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం వెళ్లడంతో కేజ్రీవాల్‌ అధికారిక నివాసం వద్ద కొన్ని గంటలపాటు హైడ్రామా నడిచింది. 
 
తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఒక్కోఆప్‌ ఎమ్మెల్యేకి రూ.25 కోట్లు ఇచ్చి..ఏడుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బయటకు రప్పించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని కేజ్రీవాల్‌ గత వారం ఆరోపించారు. దీనిపై బీజేపీ నుంచి ఫిర్యాదు అందడంతో ఆరోపణలపై ఆధారాలు చూపాలంటూ నోటీసు జారీ చేయడానికి క్రైం బ్రాంచ్‌ బృందం ఆయన నివాసానికి చేరుకుంది. 
 
నోటీస్‌ కేజ్రీవాల్‌ పేరుపై ఉంది కాబట్టి స్వయంగా దానిని ఆయనకే అందజేస్తామని ఏసీపీ స్థాయి అధికారి పట్టుబట్టారు. అందుకు నిరాకరించిన సీఎం నివాస సిబ్బంది నోటీసును తమకే ఇవ్వాలని, అది అందుకున్నట్టు రసీదు ఇస్త్తామని తెలిపారు. దీంతో దాదాపు ఐదు గంటలపాటు సీఎం ఇంటివద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. చివరికి..సీఎం సిబ్బందికి నోటీసులు అందజేస్తూ ఢిల్లీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు
 
తన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను మూడు రోజులలో సమర్పించాలని పోలీసులు కేజ్రీవాల్‌ను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారంలో ఆధారాలు ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల బృందం తొలుత శుక్రవారం రాత్రి సీఎం నివాసానికి వెళ్లింది. సుమారు గంటపాటు వేచి చూసి, చివరికి నోటీసులు ఇవ్వకుండానే వెనుదిరిగారు.ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మరోసారి ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ బృందం సీఎం నివాసానికి వెళ్లింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అవినీతిలో మకుటం లేని మహరాజు అని, నిత్యం పరారీలోనే ఉంటారని బీజేపీ ఆరోపించింది. సీఎం ఇంటి వద్ద శనివారం జరిగిన పరిణామాలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఐదుసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్‌ దర్యాప్తుకు సహకరించకుండా, ఈడీ ముందు హాజరు కాకుండా పరారీలో ఉన్నారని ఆరోపించారు.

ఇలా ఉండగా, దాదాపు 65 వేల మందికి నకిలీ రోగులకు మొహల్లా క్లినిక్‌లలో గత ఏడాది రోగ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వెల్లడించింది. రెండు ప్రైవేటు ల్యాబ్‌లు గతేడాది ఫిబ్రవరి- డిసెంబర్‌ మధ్య దాదాపు 22 లక్షల పరీక్షలు జరిపాయని, వీటిలో 65 వేల పరీక్షలు నకిలీవని, తప్పుడు డాటాతో వాటిని సృష్టించాయని అధికారులు శనివారం మీడియాకు తెలిపారు. ఈ పరీక్షలు చేసినందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆ ల్యాబ్‌లకు రూ.4.63 కోట్లు చెల్లింపులు చేసిందని పేర్కొన్నారు.