పద్మశ్రీ గ్రహీతలకు రూ 25 లక్షల బహుమతి

తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి రూ.25 లక్షలు నగదు బహుమతి, ప్రతి నెలా రూ 25 చొప్పున పింఛన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పద్మపురస్కారాలకు ఎంపికైన వారికి శిల్పకళావేదికలో సన్మానించారు.  పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారు పద్మవిభూషణ్ గ్రహీతలు వెంకయ్యనాయుడు, చిరంజీవి, పద్మశ్రీ గ్రహీతలు దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్‌లాల్, కూరెళ్ల విఠలాచార్య, ఉమామహేశ్వరిని ప్రభుత్వం తరుపున సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సన్మానించారు.

వెంకయ్యనాయుడు, చిరంజీవి చేతుల మీదుగా వారికి చెక్కులను బహూకరణ చేశారు. వెంకయ్యను సన్మానించడం మనల్ని మనమే సన్మాంచుకోవడమేనని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఢిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్య నాయుడు పెద్ద దిక్కు అని కొనియాడారు.  తెలుగు కళాకారులు ఎక్కడ ఉన్నా గౌరవించుకోవాలని సూచించారు.

అప్పట్లో దివంగత మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు జంట కవుల్లా ఉండేవారని రేవంత్ రెడ్డి కొనియాడారు. అప్పట్లో జైపాల్ రెడ్డి, వెంకయ్య ప్రజల కోసం పరితపించేవారని గుర్తు చేశారు. ఒకటి రెండు సినిమాలు హిట్ అవ్వగానే మా అంతటి వాళ్లు లేరనుకునే వాళ్లను చూస్తున్నామని, 150 పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి ఇప్పటికే ఒదికి పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.

మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి కేంద్ర ప్రభుత్వం గుర్తించి అవార్డులు ఇచ్చిందని హర్షం ప్రకటించారు. అలాంటి తెలుగు వారిని మనం సత్కారించుకోవాలని చెబుతూ రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ కొత్త సంప్రాదాయాన్ని నెలకొల్పామని తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.