ఓయూ గర్వించేలా గవర్నర్ బాధ్యతలు నిర్వహిస్తా

పూర్వ విద్యార్థిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం గర్వించేలా నూతన బాధ్యతలను నిర్వర్తిస్తానని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆదివారం దూరవిద్యా కేంద్రం ఆడిటోరియంలో ఉస్మానియా ఫౌండేషన్, ఉస్మానియా పూర్వవిద్యార్థుల సంఘం ఆయనను ఘనంగా సన్మానించారు. రాజకీయాలకు అతీతంగా పూర్వవిద్యార్థులంతా ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. 

తన వంతుగా ఓయూ పురోభివృద్ధికి సహకరిస్తానని చెబుతూ ఇటీవలి కాలంలో ఓయూలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. ఉస్మానియా ఫౌండేషన్, పూర్వవిద్యార్థుల సంఘం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారిని గౌరవించుకోవాలని సూచించారు. ఫలితంగా ఓయూకు ఆయా రంగాల్లో మరింత రీచ్ పెరుగుతుందని చెప్పారు. ఉస్మానియన్లు త్రిపురను సందర్శించి తన ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు.

అంతకు ముందు ఉస్మానియా ఫౌండేషన్, పూర్వవిద్యార్థుల సంఘం తరఫున ఇంద్రసేనారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఉస్మానియాలో గత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓయూ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవిందర్ యాదవ్ వివరించారు. 21పాయింట్ అజెండాలో భాగంగా తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసిన విషయాన్ని వెల్లడించారు. 

ప్రవాస ఉస్మానియన్ల సూచనతో సెక్షన్ 8 కంపెనీ కింద ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేశామని, ఫలితంగా విదేశీ నిధులను సైతం సజావుగా పొందేందుకు వీలుకల్పించామని తెలిపారు. పూర్వ విద్యార్థిగా ఓయూ అభివృద్ధికి తోడ్పాటునందించాలని రిజిస్ట్రార్ ఆచార్య పి. లక్ష్మినారాయణ విజ్ఞప్తి చేశారు.  విద్యార్థి నాయకుడిగా ఓయూలో ప్రస్తానం ప్రారంభించిన ఇంద్రసేనారెడ్డి రాజ్యాంగబద్దమైన ఉన్నత పదవిలో వన్నె తీసుకురావాలని పూర్వవిద్యార్థుల సంఘం ప్రతినిధులు శ్యాంమోహన్, డాక్టర్ విజయ్, ప్రొఫెసర్ రమేష్ రెడ్డి ఆకాంక్షించారు.