విశాఖ టెస్టులో కోహ్లికి వీరాభిమాని రజత్ పాటిదార్

కోహ్లిని విపరీతంగా అభిమానించే క్రికెటర్లలో రజత్ పాటిదార్ ముందు వరుసలో ఉంటాడు. ఐపీఎల్ లో తన అభిమాన ఆటగాడితో కలిసి ఆర్ సీబీకి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విషయమని పాటిదార్ చాలాసార్లు పేర్కొన్నాడు. ఇవాళ విశాఖప్నటం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ ను కాదని రజత్ పాటిదార్ వైపు రోహిత్ శర్మ మొగ్గు చూపాడు.

గత రెండెళ్లుగా రజత్ పాటిదార్ దేశవాలీ క్రికెట్ లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. మధ్యప్రదేశ్ కు చెందిన రజత్ పాటిదార్ స్ట్రోక్ ప్లే తనను వైవిధ్యమైన ఆటగాడిగా నిలిపింది.ఇక రంజీల్లో ముంబై హవా ప్రారంభం కాకముందే హోల్కర్స్ జట్టుదే గుత్తాధిపత్యం. 1941 నుంచి 1955 వరకు 12 సంవత్సరాల్లో హోల్కర్ జట్టు నాలుగు సార్లు చాంపియన్ గా.. ఆరుసార్లు రన్నరప్ గా నిలవడం విశేషం.

అయితే 1950 తర్వాత మధ్యప్రదేశ్ ఏర్పడిన తర్వాత సెంట్రల్ ఇండియా నుంచి సరైన ఫ్రంట్ లైన్ క్రికెటర్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేకపోయాడు. తాజాగా పాటిదార్ కు ఆ అవకాశం వచ్చింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇప్పటివరకు 55 మ్యాచ్ లు ఆడిన రజత్ పాటిదార్ 4వేలకు పైగ పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇక 2021-22 రంజీ ట్రోఫీని మధ్యప్రదేశ్ గెలవడంలో రజత్ పాటిదార్ కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో రజత్ పాటిదార్ ఆరు మ్యాచ్ లాడి 658 పరుగులతో రెండో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.  2022 ఐపీఎల్ సీజన్ లో ఆర్ సీబీ తరపున ఆడిన రజత్ పాటిదార్ 2021 సీజన్ లో దారుణ ప్రదర్శనతో ఆర్సీబీ పక్కనబెట్టడంతో వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. అయితే 2022 సీజన్ లో లువ్ నిత్ సిసోడియా గాయంతో వైదొలడంతో చివరి నిమిషంలో ఆర్ సీబీ రజత్ పాటిదార్ ను ట్రేడింగ్ కింద తీసుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో 54 బంతుల్లోనే 112 పరుగులు అజేయంగా నిలిచి ఒంటిచేత్తో జట్టును క్వాలిఫయర్ 2కు చేర్చాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న పాటిదార్ ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో సెంచరీ సాధించిన తొలి అన్ క్యాప్ డ్ ప్లేయర్ గా నిలిచాడు. అంతేకాదు ప్లేఆఫ్స్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా సాహాతో కలిసి పాటిదార్ స్థానం దక్కించుకున్నాడు.

ఆ సీజన్ లో 8 మ్యాచ్ లాడి 333 పరుగులు సాధించి దుమ్ములేపాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 21, 2023లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే ద్వారా పాటిదార్ అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. తాజాగా ఇంగ్లండ్ తో రెండో టెస్టుకు ఎంపికైన పాటిదార్ సంప్రదాయ క్రికెట్ లోనూ అడుగుపెట్టాడు. టెస్టు సిరీస్ కు ముందు ఇంగ్లండ్ తో జరిగిన అనధికారిక టెస్టులో రజత్ పాటిదార్ మెరుపు సెంచరీ సాధించి అందరిని ఆకట్టుకున్నాడు. తన స్థిరమైన ప్రదర్శనే ఇవాళ తుది జట్టులో చోటు దక్కేలా చేసింది.