ఏపీలో విధ్వంసక, విద్వేషపూరిత పాలన

* ఏపీలో ఎన్నికల శంఖారావం పూరించిన పురందేశ్వరి
 

ఏపీలో వైసిపి ప్రభుత్వం విధ్వంసక పాలన, విద్వేషపూరిత పాలన కొనసాగిస్తొందని రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు  దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు.  ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమై గుళ్లు, గుళ్లలోని విగ్రహాలను కూలగొడుతున్నారని ఆమె మండిపడ్డారు. తలకాయ లేని మొండెంలా  రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని చేశారని ధ్వజమెత్తారు.

 
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖరావాన్ని పూరించింది. ఏకకాలంలో రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యాలయాలను పురందరేశ్వరి నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని భీమవరంలో వర్చువల్ పద్ధతిలో గురువారం ప్రారంభించారు.  ఆయా జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఎల్ ఇడి స్క్రీన్ లద్వారా పురంధరేశ్వరి సందేశాన్ని వీక్షించారు.
తొలుత బీజేపీ శ్రేణులు భీమవరం పట్నంలో 5కి.మీ మేర భారీ ర్యాలీ నిర్వహించారు. శంఖం పూరించడం ద్వారా ఎన్నికల నగారా మోగించామని ఆమె ప్రకటించారు.  అమరావతిని ఏపీ రాజధానిగా భావించి నిధులు, రోడ్లు మంజూరు చేసిన ఘనత బిజెపికే దక్కుతుందని ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు. పోలవరంకు జాతీయ హోదాను కల్పించిన తర్వాత ప్రతి రూపాయిని కేంద్రమే ఖర్చు చేస్తోందని ఆమె తెలిపారు.   
 
అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేస్తే, దానిని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి సామాన్యుడిపై ఉందని చెబుతూ అలా ఎవరైనా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతూ జైల్లో పెడుతున్నారని మాజీ కేంద్ర మంత్రి మండిపడ్డారు. సామాజిక సాధికారిక యాత్ర పేరుతో యాత్ర చేస్తున్న వైసీపీకు ఆ నైతిక హక్కు ఉందా అని ఆమె ప్రశ్నించారు.
 
తెలుగుదేశం, వైసిపి పార్టీలు కేంద్రం సహకరించలేదని చెబుతున్నాయని పేర్కొంటూ డిపిఆర్ కు ముందే రూ. 2500 కోట్లు రాజధానికి కేంద్రం ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. నరసాపురం వశిష్ట వారధికి కేంద్రం రూ. 400 కోట్లు నిధులు కేటాయించిందని చెప్పారు. జాతీయ హోదా ఇచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణంలో టిడిపి హయాంలో మూడేళ్లు జాప్యం జరిగిందని, వైసీపీలో రివర్స్ ట్రెండింగ్ వల్ల పోలవరం దెబ్బతిందని విమర్శించారు.
 
కాంగ్రెస్‌కు ఏపీలో కొత్త అధ్యక్షురాలు వచ్చారని, ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్నారని పురందేశ్వరి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం అంటే, ప్రత్యేక ప్యాకేజీకి గతంలో అంగీకరించ లేదా? అని అనే ప్రశ్నించారు. బీజేపీ ఏపీకి ఏ విధంగానూ అన్యాయం చేయలేదని ఆమె తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా సీఎం జగన్ ప్రకటిస్తూ స్టిక్కర్లు అంటించుకుంటున్నారని, అందుకే జగన్ ప్రభుత్వం స్టిక్కర్ల ప్రభుత్వంగా మిగిలిపోతుందని పురంధేశ్వరి ఎద్దేవా చేశారు.
 
తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసి, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి మండిపడ్డారు.  బిజెపి అధికారంలోకి రాకముందు దేశంలో స్కామ్ లు మాత్రమే ఉండేవని,  బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం స్కీమ్ లను తీసుకొచ్చిందని చెబుతూ గత పదేళ్లుగా అవినీతి లేని పాలనను అందించామని ఆమె తెలిపారు.ఒకేసారి 25 పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామని పురందేశ్వరి తెలిపారు. రాజకీయ పార్టీలకు కార్యాలయాలు గుండెకాయలయితే, కార్యకర్తలు గుండె చప్పుళ్లలాంటివారని ఆమె చెప్పారు. బీజేపీ కార్యకర్తలను గౌరవిస్తుందని చెబుతూ అందుకే ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కాగలిగారని ఆమె తెలిపారు. 

వారసత్వ నాయకత్వానికి బీజేపీలో తావు లేదని, తండ్రి తర్వాత కొడుకు అనేలా బీజేపీ లో ఉండదని ఆమె స్పష్టం చేశారు. కష్టపడ్డ కార్యకర్తకు మాత్రమే ఈ పార్టీలో గుర్తింపు ఉందని స్పష్టం చేశారు.ప్రధాని మోదీ మహిళలకు పార్లమెంటులో 33 శాతం రిజర్వేషన్లు కల్పించి, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సాహిస్తున్నారని చెబుతూ బీజేపీ అన్ని పార్టీల కంటే భిన్నమైనదని.. ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ లలో అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆమె తెలిపారు. నరసాపురం లోక్ సభ స్థానంలో రెండు పర్యాయాలు బీజేపీ కైవసం చేసుకున్న చరిత్ర ఉందని ఆమె గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో దేశంలో బీజేపీ 350 ఎంపీ సీట్లు గెలవనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు.