భారీగా పెరుగుతున్న అమెరికా వీసా ఫీజులు

త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న  నేపథ్యంలో వివిధ కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. వాటిలో హెచ్-1, ఎల్-1, ఇబి-5 వంటి ఇమిగ్రెంట్ వీసాలున్నాయి. ముఖ్యంగా, హెచ్-1బి, ఎల్-1, ఇబి-5 వీసాలు అమెరికాకు వలస వెళ్లేందుకు భారతీయులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునేవి.

2016 తర్వాత  హెచ్-1, ఎల్-1, ఇబి-5 వీసా ఫీజులను పెంచడం ఇదే మొదటిసారి. హెచ్-1, ఎల్-1, ఇబి-5 వీసాల కోసం పెంచిన కొత్త ఫీజులు 2024, ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయని యుఎస్ తెలిపింది.  అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) ఉపయోగించే ఫారమ్‌లు, ఫీ స్ట్రక్చర్‌లలో మార్పుల వల్ల నికర ఖర్చులు పెరిగిన నేపథ్యంలో వీసా ఫీజుల పెంపు అనివార్యమైందని యూఎస్ హోం శాఖ తెలిపింది.

హెచ్-1బి  వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ఇది అమెరికాలోని కంపెనీలు సాంకేతిక నైపుణ్యం లేదా ఇతర ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. భారతదేశం మరియు చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం వేల మంది ఉద్యోగులను అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు ఈ వీసా ఆధారంగా నియమించుకుంటాయి.

ఇబి-5 ప్రొగ్రామ్ ను 1990లో అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. అమెరికన్లకు ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడేలా అమెరికాలో కనీసం 5 లక్షల డాలర్లతో వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధమైన వారికి, వారి కుటుంబ సభ్యులకు అమెరికా ఈ ఇబి-5 వీసా అందజేస్తుంది.

ఎల్ -1 వీసా కూడా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీలోకి వస్తుంది. ఇది ఇంట్రా కంపెనీ బదిలీ దారుల కోసం ఉద్దేశించిన వీసా. బహుళజాతి కంపెనీలు తమ విదేశీ కార్యాలయాల నుండి నిర్దిష్ట సంఖ్యలో ఉద్యోగులను అమెరికాలో తాత్కాలికంగా పని చేయడానికి బదిలీ చేసుకోవడానికి ఈ వీసా అనుమతిస్తుంది.

అమెరికా వీసా ఫీజు పెంపు వివరాలు..

  • కొత్త హెచ్-1బి దరఖాస్తు (I-129) వీసా రుసుము $ 460 (రూ. 38,000 కంటే ఎక్కువ) నుండి $ 780 (రూ. 64,000 కంటే ఎక్కువ)కి పెంచారు. అలాగే, వచ్చే సంవత్సరం నుంచి హెచ్-1బి రిజిస్ట్రేషన్ $ 10 (రూ. 829) నుండి $ 215 (రూ. 17,000 కంటే ఎక్కువ) పెరుగుతుంది.
  • ఎల్-1 వీసాల రుసుము 460 డాలర్ల (రూ. 38,000 కంటే ఎక్కువ) నుండి 1,385 డాలర్లకు (రూ. 1,10,000 కంటే ఎక్కువ) పెంచారు.
  • పెట్టుబడిదారుల వీసా ఫీజుగా ప్రసిద్ధి చెందిన ఇబి-5 వీసా ఫీజును 3,675 డాలర్ల (రూ. 3,00,000 కంటే ఎక్కువ) నుండి 11,160 డాలర్లకు (రూ. 9,00,000 కంటే ఎక్కువ) పెంచారు.

మరోవంక, వీసాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో మోసాలకు చెక్‌ పెట్టేందుకు 2025 ఆర్థిక సంవత్సరానికి జారీచేసే హెచ్‌-1బీ వీసాల లాటరీ ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు కొత్త నిబంధనలు ప్రకటించింది. దీంతో ఇకపై వీసా కోసం ఎవరు ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా ఒకే దరఖాస్తుగా పరిగణిస్తారు. ఒకే వ్యక్తి తరఫున అనేక దరఖాస్తులు సమర్పించి లాటరీ విధానంలో ప్రయోజనం పొందేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు.

పిటిషన్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌సీఐఎస్‌  వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి దరఖాస్తుదారుడు సరైన పాస్‌పోర్టు వివరాలు, ప్రయాణ పత్రాలను విధిగా సమర్పించాల్సి ఉంటుందని, తప్పుడు సమాచారం ఉన్న దరఖాస్తులను తిరస్కరించే అధికారం యూఎస్‌సీఐఎస్‌కి ఉంటుందని స్పష్టం చేసింది. 2025 వీసాల తొలి రిజిస్ట్రేషన్‌ మార్చి 6 నుంచి 22 వరకు కొనసాగుతుందని తెలిపింది.