25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం

సబ్‌కా  సాథ్ లక్ష్యంతో గత పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలను వివిధ రకాల పేదరికం నుంచి బయటపడేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూగత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థలో చాలా అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పురోగమించిందని చెప్పారు.
 
 ఆయన ప్రధాని అయ్యాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని చెబుతూ సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ మంత్రంతో ప్రభుత్వం ఈ సవాళ్లను ఎదుర్కొందని ఆమె తెలిపారు. దేశానికి కొత్త లక్ష్యం, కొత్త ఆశ వచ్చిందన్నాని పేర్కొంటూ ప్రజలు మళ్లీ భారీ ఆదేశంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆమె గుర్తు చేశారు.
 
  భార‌త్‌ను 2047 నాటికి విక‌సిత భార‌త్‌గా తీర్చిదిద్దేందుకు త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని ఆమె చెప్పారు. మోదీ స‌ర్కార్‌కు చెందిన చివ‌రి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆమె మాట్లాడుతూ దేశ ప్ర‌జ‌ల స‌గ‌టు ఆదాయం 50 శాతం పెరిగిన‌ట్లు తెలిపారు. గ‌డిచిన ప‌దేళ్ల‌లో మ‌హిళ‌ల సాధికార‌త పెరిగింద‌ని, ట్రిపుల్ త‌లాక్‌ను చ‌ట్ట‌రీత్యా నేరం చేశామ‌ని పేర్కొన్నారు. 
 
ప్ర‌భుత్వ స్కీమ్ కింద 70 శాతం మంది మ‌హిళ‌ల‌కు ఇండ్లు అంద‌జేసిన‌ట్లు చెప్పారు. అన్ని ర‌కాల మౌళిక‌స‌దుపాయాల్ని రికార్డు స‌మ‌యంలో ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. భార‌త అభివృద్ధిలో దేశంలోని అన్ని ప్రాంతాలు భాగ‌స్వామ్యం అవుతున్నాయ‌ని చెబుతూ వ‌న్ నేష‌న్ వ‌న్ మార్కెట్ వ‌ల్ల ద్ర‌వ్యోల్బ‌ణం అదుపులో ఉంద‌ని చెప్పారు.  ఉన్న‌త విద్యాభ్యాసం కోసం మ‌హిళ‌ల సంఖ్య పెరిగింద‌ని తెలిపారు.
 
రెట్టింపు సవాళ్లను స్వీకరించామని, సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ మంత్రంతో పని చేశామని చెబుతూ సబ్‌కా ప్రయాస్‌ మంత్రంతో మనం కరోనా కాలాన్ని ఎదుర్కొన్నామని  నిర్మలా సీతారామన్ తెలిపారు. యువ దేశం ప్రస్తుతం గొప్ప ఆకాంక్షలు, అంచనాలను కలిగి ఉందని చెబుతూ గత 10 ఏళ్లలో అందరికీ ఇళ్లు, ప్రతి ఇంటికి నీరు, అందరికీ బ్యాంకు ఖాతాలు వంటి పనులను రికార్డు సమయంలో పూర్తి చేశామని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. 
 
80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అందించామని, రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను పెంచామని, పారదర్శకతతో వనరుల పంపిణీ జరిగిందని ఆమె తెలిపారు. సామాజిక మార్పు తీసుకురావడానికి అసమానతలను తొలగించడానికి ప్రయత్నించామని చెప్పారు.  పేదలు, మహిళలు, యువత, రైతులపై దృష్టి సారించామని చెబుతూ పేదల సంక్షేమం, దేశ సంక్షేమం మంత్రంగా పనిచేస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 
 
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. పదేళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయని చెబుతూ బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్ఛ స్థితికి చేరుకుందని స్పష్టం చేశారు. 
 
సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందని పేర్కొంటూ  నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని ఆర్ధికమంత్రి చెప్పారు. ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 
 
సమ్మిళిత, సంతులిత ఆర్థిక విధానాలతో చిట్టచివరి వ్యక్తికి ప్రగతి ఫలాలు అందాయని చెప్పారు. ఇంటింటికీ విద్యుత్‌, ఇంటిల్లిపాదికి ఉపాధి, ఇంటింటికి తాగునీరు సమ్మిళిత అభివృద్ధికి నిదర్శనాలని ఆమె వివరించారు.