రిషి సునాక్‌ వారంలో 36 గంటలపాటు ఉపవాసం

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ప్రతి వారం 36 గంటలపాటు ఉపవాసం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి మంగళవారం ఉదయం 5గంటల వరకు ఆయన ఉపవాసం ఉంటూ కేవలం నీళ్లు, టీ లేదా బ్లాక్‌ కాఫీ మాత్రమే తీసుకుంటారు. ఈ విషయాన్ని ఇటీవల బ్రిటన్‌ మీడియా ఐటీవీ- మిడ్ మార్నింగ్ షోలో రిషి సునాక్ వెల్లడించారు.
 
సమతౌల్య జీవనశైలిలో భాగంగానే ఈ నియమాన్ని పాటిస్తున్నట్లు ప్రధాని చెప్పినట్టు పేర్కొంది. ఉపవాసాన్ని ఒక్కో వ్యక్తి భిన్నంగా చేస్తారన్న రిషి సునాక్‌ మిగతా రోజుల్లో తనకు ఇష్టమైన తీపి పదార్థాలను తింటానని తెలిపారు. తనకు ఆహారం అంటే ఎంతో ఇష్టమని, పదవీ బాధ్యతల దృష్ట్యా గతంలో మాదిరిగా వ్యాయామానికి సమయం కేటాయించడం లేదని చెప్పారు. 
 
అందుకే వారం ప్రారంభంలో ఇదో చిన్న రీసెట్‌ వంటిదని సునాక్ వివరించారు. దీనిపై యూకే ప్రధాని సన్నిహితులు స్పందిస్తూ సోమవారం పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండటం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. ఆరోజు కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని వారు తెలిపారు.  వృత్తి, వ్యక్తిగత జీవితంలో అన్ని కోణాల్లో ఏకాగ్రత, క్రమశిక్షణకు ఇది నిదర్శనమని చెప్పినట్లు బ్రిటన్‌ మీడియా పేర్కొంది.
ప్రతి వారం 36 గంటల పాటు ఉపవాసం ఉండే రిషి సునక్ డైట్ ప్యాటర్న్‌ను మాంక్ ఫాస్ట్ అని పిలుస్తారు. ఇది ఒక రకమైన అడపాదడపా ఉపవాసం అని నిపుణులు అంటున్నారు.  వ్యాయామంతో కలిపి, ఉపవాస విధానం కొవ్వును తగ్గించడానికి, శరీర కండరాల శక్తిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. 36 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల శరీరంలోని మృత కణాలను బయటకు వెళ్లడానికి, ఆరోగ్యకరమైన కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది.