అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌పై భారీ విజయం

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌లో భారత కుర్రాళ్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఓటమనేదే లేకుండా ఆడుతున్న భారత్ గ్రూప్‌ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయాలు సొంతం చేసుకుంది. తాజాగా కివీస్‌తో జరిగిన సూపర్‌ సిక్స్‌ పోరులోనూ జయకేతనం ఎగురవేసింది. 

సూపర్‌ సిక్స్‌ స్టేజ్‌లో కివీస్‌తో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 295 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ 81 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా యువ భారత్‌ 214 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత బ్యాటర్ ముషీర్‌ ఖాన్‌ (131) సెంచరీతో చెలరేగాడు. బౌలర్లలో సౌమి పాండే 4 వికెట్లు తీశాడు.

ఛేదనలో కివీస్‌ బ్యాటర్లు ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును చేరుకోలేదు. కెప్టెన్‌ ఆస్కార్‌ జాక్సన్‌ 19 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్‌ జట్టులో నలుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే పరిమితమవగా ముగ్గురు సింగిల్‌ డిజిట్‌ స్కోరు చేశారు. నలుగురు మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోరు చేశారు. 

కివీస్‌ను ఆది నుంచే భారత బౌలర్లు దెబ్బతీశారు. నమన్‌ తివారి (1-19), రాజ్‌ లింబాని (2-17) ఆరంభంలో తమ పేస్‌తో కివీస్‌ను కోలుకోనీయకుండా చేశారు. ఆ తర్వాత స్పిన్నర్‌ సౌమి పాండే పది ఓవర్లు వేసి రెండు మెయిడిన్లతో 19 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. 

ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ముషీర్‌ ఖాన్‌.. బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 3.1 ఓవర్లు వేసిన అతడు.. పది పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అర్షిన్‌ కులకర్ణి ఒక వికెట్‌ పడగొట్టాడు. ఈ విజయంతో భారత్‌ సూపర్‌ సిక్స్‌ స్టేజ్‌లో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 2న నేపాల్‌తో ఆడనుంది.