ఇమ్రాన్‌కు ఒక కేసులో పదేళ్లు, మరో కేసులో 14 ఏళ్ళు జైలు

ఫిబ్రవరి 8న  పార్ల‌మెంట్ ఎన్నికలు జరుగనున్న పాకిస్థాన్ లో మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌కు వరుసగా జైలు శిక్షలు పడుతున్నాయి. సోమవారం ఒక కేసులో పదేళ్లు జైలు శిక్ష పడగా, మంగళవారం  తోషాకానా కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు ఆయ‌నకు ఇవాళ 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.  ఈ కేసులో ఆయ‌న భార్య బుస్రా బీబీకి కూడా 14 ఏళ్ల శిక్ష‌ను విధించారు.
ప‌దేళ్ల పాటు ఎన్నిక‌ల్లో పాల్గొన‌రాదు అని కోర్టు ఇమ్రాన్ ఖాన్‌పై అన‌ర్హ‌త వేటు కూడా విధించింది. ఆ జంట సుమారు రూ.1.5 బిలియ‌న్లు జ‌రిమానా క‌ట్టాల‌ని కోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు విచార‌ణ‌కు బుస్రా బీబీ హాజ‌రుకాలేదు. రెండు రోజుల క్రితం అఫిషియ‌ల్ సీక్రెట్స్ చ‌ట్టం కింద ఇమ్రాన్‌తో పాటు విదేశాంగ మంత్రి షా మ‌హ‌మ్మ‌ద్ ఖ‌రేషికి మ‌రో కేసులో ప‌దేళ్ల జైలు శిక్షపడింది.

2022లో ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయే ముందు ఇమ్రాన్‌ ఖాన్‌ బహిరంగ ర్యాలీలో మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అగ్రరాజ్యం అమెరికా కుట్రపన్నిందని ఆరోపించారు. అమెరికా ఆదేశాలకు అనుగుణంగా పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం నడుచుకుంటోందని ఆరోపణలు గుప్పించారు. ఇందుకు ఆధారాలుగా కొన్ని పత్రాలను ఆ ర్యాలీలో ప్రదర్శించారు.

అమెరికాలోని పాకిస్థాన్‌ ఎంబసీ నుంచి వాటిని సేకరించినట్లు తెలిపారు. దీంతో అధికారిక దౌత్య సమాచారానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడం ద్వారా దేశ రహస్య చట్టాలను ఉల్లంఘించారని ఇమ్రాన్‌ ఖాన్‌, ఖురేషీలపై పాకిస్థాన్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన స్పెషల్‌ కోర్టు.. ఇద్దరినీ దోషులుగా తేల్చింది.

ఈ మేరకు ఇరువురికీ పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ లో ఎన్నికలు జరగడానికి తొమ్మిది రోజుల ముందు ఈ జైలు శిక్ష విధించడం గమనార్హం.  పిటిఐ అధికారిక ఎన్నికల గుర్తు లేకుండా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నది. మే 9న జరిగిన హింసాయుత సంఘటనలకు సంబంధించిన కేసులో ఇమ్రాన్ ఖాన్ ఇతరులకు శిక్షలు పడితే ప్రతిపక్ష పార్టీని నిషేధించే అవకాశం ఉందని ఎన్నికల గుర్తు లేకుండా పోటీ చేస్తున్నారు.