
* నేటి నుండే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుండి ప్రారంభం అవుతున్న సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై ఉన్న సస్పెన్షన్‌ను మంగళవారం ఎత్తివేశారు. రాజ్యసభలో 11 ప్రతిపక్ష ఎంపీలపై చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ ఎత్తేయగా, లోక్‌సభలో ముగ్గురు ఎంపీలపై స్పీకర్ ఓం బిర్లా సస్పెన్షన్ తొలగించారు.
14 మంది ఎంపీల సస్పెన్షన్ తొలగించాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఉభయ సభాపతులు అంగీకరించారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. మోదీ ప్రభుత్వ చివరి పార్లమెంటు (బడ్జెట్) సమావేశాలు బుధవారం నుండి ప్రారంభం కానున్న క్రమంలో మంగళవారం కేంద్రం జరిపిన అఖిలపక్ష సమావేశం అనంతరం గత సమావేశాలలో ప్రతిపక్ష సభ్యులపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయాలని ప్రభుత్వం కోరినట్టు ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. సస్పెండ్ అయిన ఎంపీలందరినీ సభకు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తరఫున విన్నవించినట్లు చెప్పారు. దీనికి స్పీకర్, చైర్మన్ అంగీకరించినట్లు తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాలను సజావుగా, సున్నితంగా నిర్వహించడంలో భాగంగా.. ఈ సస్పెన్షన్‌ని ఎత్తివేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టడంతో (రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు) సుమారు 146 మందిపై గతనెల శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ సస్పెండ్ సస్పెండ్ వేటు వేసింది. 146 మందిలో 136 మంది మిగిలిన సెషన్‌లలో సస్పెండయ్యారు. సెషన్ ముగియగానే వారి సస్పెన్షన్ రద్దైంది.
అయితే మొత్తం 14 మంది ఎంపిల (11 మంది రాజ్యసభ, ముగ్గురు లోక్‌సభ సభ్యులు) కేసును ప్రత్యేక హక్కుల సంఘానికి సమర్పించారు. జనవరి 12న లోక్‌సభ ప్రత్యేక హక్కుల సంఘం ముగ్గురు సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మిగిలిన 11 మంది రాజ్యసభ ఎంపిల సస్పెన్షన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.
ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి, లోక్‌సభలో ఉప నాయకుడు రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆయన సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న నేతలలో కె సురేష్ (కాంగ్రెస్), సుదీప్ బందోపాధ్యాయ్ (టిఎంసి), టిఆర్ బాలు (డిఎంకె), రాహుల్ షెవాలె (శివసేన), ఎస్‌టి హాసన్ (సమాజ్‌వాది పార్టీ), రామ్ నాథ్ ఠాకూర్ (జెడియు), గల్లా జయదేవ్ (టిడిపి) కూడా ఉన్నారు.
సమావేశంలో 30 పార్టీలకు చెందిన 45 మంది నేతలు పాల్గొన్నారని ప్రహ్లాద్ జోషి తెలిపారు. మెరుగైన వాతావరణంలో సమావేశం జరిగిందని చెబుతూ 17వ లోక్‌సభ చివరి సమావేశాలు ఇవేకావడం గమనార్హం. నిర్మాణాత్మక చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన, ఇందులో భాగంగానే ఎంపీల సస్పెన్షన్‌ని రద్దు చేయాలని తాము కోరామని కేంద్ర మంత్రి చెప్పారు. బడ్జెట్ సెషన్ సమర్థవంతంగా సాగడంలో పార్లమెంటరీ సభ్యుల మధ్య సంభాషణ, సహకారం ప్రాముఖ్యత ఉందని స్పష్టం చేశారు.
ఈ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం తరఫున తాను విజ్ఞప్తి చేస్తున్నానని ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒకవేళ సభలో సహకరించకుండా అనవసరమైన రాద్ధాంతం సృష్టిస్తే మాత్రం.. స్పీకర్ తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్-మేలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ సమర్పణతో మొదలుకొని.. ఫిబ్రవరి 9న ఈ సెషన్ ముగుస్తుంది. ఈ సెషన్ సందర్భంగా అర్థవంతమైన చర్చలను కొనసాగించాలని, ఎంపీలందరూ ఈ చర్చల్లో భాగస్వామ్యం అవ్వాలన్న విషయాలపై దృష్టి కేంద్రీకరించారు.
రాష్ట్రపతి ప్రసంగం, ఓట్ ఆఫ్ అకౌంట్స్‌పై చర్చలను సులభతరం చేసేందుకు గాను తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్యసభ ప్రివిలేజెస్ ప్యానెల్‌కు చెందిన ఒక ప్రతినిధి మాట్లాడుతూ ఎంపీలందరూ చర్చల్లో పాల్గొనడానికి, అలాగే రాష్ట్రపతి ప్రసంగాన్ని వినడానికి అనుమతించే నిబద్ధతను పునరుద్ఘాటించారు.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!