పళనిఆలయంలో హిందువులకు మాత్రమే ప్రవేశం 

తమిళనాడులోని ప్రఖ్యాత దేవస్థానాల్లో ఒకటైన పళనిలోని సుబ్రహ్మణ్యస్వామివారు కొలువైన ఆలయంలో మురుగన్‌గా, దండాయుధపాణిగా స్వామివారిని కొలుస్తారు భక్తులు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి వేలాదిమంది సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకుంటుంటారు.

దిండిగల్ జిల్లాలో గల ఈ ఆలయంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందువులకు మాత్రమే ఈ ఆలయంలో ప్రవేశాన్ని కల్పించింది. హిందుయేతరులు ఆలయానికి వెళ్లడంపై నిషేధం విధించింది. హిందూ ధర్మం అంటే నమ్మకం లేని వాళ్లు, నాస్తికులకు ఆలయంలోనికి వెళ్లడం సరికాదని తేల్చి చెప్పింది.

నాస్తికులకు ఆలయ ప్రవేశం లేదని స్పష్టం చేసింది. దైవం పట్ల భక్తి భావం లేనివారికీ ఈ తీర్పు వర్తిస్తుందని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోకి హిందూవేతరులను ఆయా పుణ్యక్షేత్రాల ధ్వజస్తంభం దాటి అనుమతించరాదని, హిందువులకు కూడా తమ మతం, వృత్తిని అభ్యసించే ప్రాథమిక హక్కు ఉందని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది.

ఈ మేరకు మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఆదేశాలు జారీచేశారు. దేవుడంటే నమ్మకం లేని వాళ్లు ఆలయానికి వెళ్లడం సరికాదంటూ పళనికి చెందిన సెంథిల్ కుమార్ అనే వ్యక్తి ఇటీవలే మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. హిందువుల ఆచార వ్యవహారాలను గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రోజూ పళని ఆలయాన్ని దర్శించడానికి వేలాదిమంది వస్తుంటారని, హిందుయేతరులు ఉంటున్నారని సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. హిందుయేతరుల వల్ల భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. వారి రాకపై నిషేధం విధించాలని, ఆలయం వద్ద బ్యానర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

‘హిందూ మతాన్ని విశ్వసించని హిందువులు కానివారిని అనుమతించవద్దని ప్రతివాదులకు సూచించాం… ఎవరైనా హిందువేతరులు ఆలయంలో నిర్దిష్ట దేవతను దర్శించుకుంటామని కోరితే దేవతపై విశ్వాసం, హిందూ మతం ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తానని, ఆలయ ఆచారాలకు కూడా కట్టుబడి ఉంటాననే వారి నుంచి హామీని పొందాలి. అటువంటి హామీతో హిందువేతరులను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించవచ్చు’ అని కోర్టు తీర్పు చెప్పింది.

ఆయన తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో న్యాయమూర్తి జస్టిస్ శ్రీమతి  ఏకీభవించారు. పిటీషనర్‌కు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చారు. హిందూయేతరులు ఆలయంలో ప్రవేశించడం సరికాదని పేర్కొన్నారు. ఒకవేళ వారు ఆలయంలోనికి వెళ్లినా  ధ్వజస్తంభం దాటి వెళ్లకూడదని సూచించారు. దీనిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అన్యమతస్తులు గుడి లోనికి ప్రవేశించాలనుకున్నా, స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నా ఆలయంలో ఓ రిజిస్టర్ ఉంచాలని, దేవుడి మీద విశ్వాసంతోనే తాను దర్శనం చేసుకుంటున్నట్లు హామీ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుందనీ తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయ ఆగమ నియమాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుందని ఆదేశించారు.

అయితే, ఈ పిటిషన్ పళని దేవాలయానికి మాత్రమే దాఖలు చేయడంతో కోర్టు ఉత్తర్వులు దానికి మాత్రమే పరిమితం కావచ్చని ప్రతివాదులు చేసిన వాదనను తోసిపుచ్చింది. ‘కానీ లేవనెత్తిన అంశం పెద్ద సమస్య.. ఇది అన్ని హిందూ దేవాలయాలకు వర్తించాలి.. కాబట్టి ప్రతివాదుల అభ్యర్థన తిరస్కరించాం.. ఈ ఆంక్షలు వివిధ మతాల మధ్య మత సామరస్యాన్ని.. సమాజంలో శాంతిని నిర్ధారిస్తాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఆర్‌ అండ్‌ సీఈ విభాగం, ఆలయ నిర్వహణలో పాలుపంచుకున్న వ్యక్తులందరూ అన్ని హిందూ దేవాలయాలకు ఆదేశాలను పాటించాలని స్పష్టం చేస్తున్నాం’ అని కోర్టు పేర్కొంది.