మేడమ్‌ టుస్సాడ్స్‌లో బాబా రాందేవ్‌ మైనపు బొమ్మ

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ మైనపు బొమ్మను న్యూయార్క్‌లోని ప్రసిద్ధిచెందిన మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖుల మైనపు బొమ్మలు సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, మన్మోహన్‌సింగ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్‌ దేవుడు సచిన్ టెండూల్కర్, నటులు సల్మాన్ ఖాన్, మహేశ్‌ బాబు, ప్రభాస్‌తో పాటు మరికొందరి మైనపు బొమ్మలున్నాయి. 

తాజాగా యోగా గురు బాబా రాందేవ్‌కు సైతం గౌరవం దక్కింది. వృక్షాసన ముద్రలో రామ్‌దేవ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాందేవ్‌ బాబా యోగాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. భారతీయ యోగా, పురాతన ఆయుర్వేద చికిత్సల ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. 

అన్ని వయసుల వ్యక్తులను ఆయన ప్రభావితం చేశారు. యోగాతో పాటు ఆయుర్వేదం, వ్యాపారంలో సైతం రాణిస్తున్నారు. మేడమ్ టుస్సాడ్స్ న్యూయార్క్ తరపున ప్రతినిధి టియాగో మొగోడౌరో మాట్లాడుతూ బాబా రామ్‌దేవ్ మైనపు బొమ్మను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

యోగాను ప్రోత్సహించడం, ఆయుర్వేద సంస్కృతిని పరిచయం చేయడం, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం పాటుపడుతున్నారని తెలిపారు. యోగాకు చేసిన సేవలకు ఆయనను గౌరవించినందుకు గర్వపడుతున్నామని చెప్పారు. బాబా రాందేవ్‌ మాట్లాడుతూ మైనపు బొమ్మను ఆవిష్కరించడం తనకు లభించిన గొప్ప గౌరవమని సంతోషం వ్యక్తం చేశారు. 

ఇది తనకు వ్యక్తిగతంగా లభించిన గుర్వహింపుగా భావించడం  లేదని, భారతీయ సంస్కృతికి, ముఖ్యంగా యోగా, ఆయుర్వేదం ప్రపంచ ప్రభావానికి ఇది ఒక ముఖ్యమైన గుర్తింపుగా తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు.