కాంగ్రెస్ ఓటమిని ఫిక్స్ చేసిన ఖర్గే..?

కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష ఇండీ కూటమి  కన్వినర్ మల్లికార్జున ఖర్గే  చేస్తున్న వ్యాఖ్యలు  తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. మళ్లీ ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ గెలిస్ ఇక దేశంలో ప్రజస్వామ్యం అంటూ ఉండదని, భవిష్యత్ భారతంలో అసలు ఎన్నికలే జరగవంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవే చివరి ఎన్నికలవుతాయని, నియంతృత్వాన్ని తీసుకువస్తారంటూ వ్యాఖ్యానించారు.
ఓ వైపు దేశంలో బీజేపీ గాలి హోరున వీస్తోంది. మోడీ నేతృత్వంలోని  ముచ్చటగా మూడోసారి విజయఢంకా మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ వైపు దేశంలో అభివృద్ధి.. మరోవైపు అంతర్జాతీయంగా భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం.. ఆర్థికంగా ప్రపంచదేశాలతో పోటీ.. దేశంలోని మెజార్టీ వర్గాల్లో సంతృప్తి.. అన్నింటితో పాటు.. అయోధ్య అంశం కూడా కలిసిరావడంతో.. మోడీ మళ్లీ ప్రధాని అవుతారనే లెక్కలు బలంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు ఇప్పటికే రెండు దఫాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ కు ఈ సారి పవర్ లోకి రావడం చాలా ముఖ్యం. అందుకు కావాల్సిన అన్ని మార్గాలనూ ఆ పార్టీ అన్వేషిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ లో ఎప్పట్లాగే నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని అభ్యర్థి ఎవరనే దానికి సమాధానం ఆ పార్టీ నుంచి ఇప్పటివరకు లేదు. ఇక యువనేత రాహుల్ గాంధీ సామర్థ్యంపై ఆ పార్టీ నాయకత్వంలో ఎలాంటి అభిప్రాయం ఉన్నా ప్రజల్లో మాత్రం గతంలో ఉన్న అభిప్రాయంలో ఎలాంటి మార్పులేదు.
ఇక సొంతంగా పోరాడి గెలిచే అవకాశం లేకపోవడంతో ప్రతిపక్షాలతో కలిసి ఇండీ కూటమి ఏర్పాటు చేసి బీజేపీకి సవాల్ విసిరింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పవర్ లోకి రావాలని తహతహ లాడుతోంది. మూడు ప్రధాన పార్టీలు హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చాయి.  మిగిలిన పార్టీలైనా కూటమిలో ఉంటాయా..?  ఈ నేపథ్యంలో  ఖర్గే వ్యాఖ్యల్లో కాంగ్రెస్ పార్టీ అసహనం స్పష్టంగా కనిపిస్తోంది.
మొన్నటి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లు అర్థమయ్యాక.. కేటీఆర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. “ఏమవుతుంది.. ఓడిపోతే ఇంట్లో కూర్చుంటాం” అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇటు ఏపీ సీఎం జగన్ కూడా తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో మాట్లాడుతూ.. ఓటమిని కూడా సంతోషంగా స్వీకరిస్తా అని అర్థం వచ్చేలా మాట్లాడారు. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడు.. ఆ విషయం అర్థం అయినప్పుడు.. రాజకీయ నాయకుల్లో వచ్చే అసహనమే.. ఇలాంటి వ్యాఖ్యల రూపంలో కనిపిస్తుంది.