
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజుల ముందు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి చివరి వారం వరకు పదవీకాలం ముగుస్తున్న 56 మందిలో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి 10 మంది ఎంపీలున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చెరో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పదవీకాలం ముగుస్తున్నవారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ (టీడీపీ), సీఎం రమేశ్ (బీజేపీ), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వైఎస్సార్సీపీ) ఉండగా.. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ పదవీకాలాలు ముగుస్తున్నాయి.
అలాగే ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ తెలుగు నేత జీవీఎల్ నరసింహారావు పదవీకాలం కూడా ఏప్రిల్ నెలతో ముగుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 15. కాగా, ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం గం. 9.00 నుంచి సాయంత్రం గం. 4.00 వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ వెంటనే సాయంత్రం గం. 5.00 నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒకవేళ పోటీ లేకపోతే ఫిబ్రవరి 15 నాటికే అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవమవుతుంది.
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ నెలతో పదవీకాలం పూర్తికానుంది. వాటిలో ఉత్తర్‌ప్రదేశ్ (10), మహారాష్ట్ర (6), బిహార్ (6), పశ్చిమ బెంగాల్ (5), మధ్యప్రదేశ్ (5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3), తెలంగాణ (3), రాజస్థాన్ (3), ఒడిశా (3), ఉత్తరాఖండ్ (1), చత్తీస్‌గఢ్ (1), హర్యానా (1), హిమాచల్ ప్రదేశ్ (1) ఉన్నాయి.
పదవీకాలం పూర్తిచేసుకుంటున్నవారిలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలుపొందడం వల్ల ఆ పార్టీ సంఖ్యాబలం మరింత పెరిగే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి ఖాళీ అవుతున్న స్థానాల్లో ప్రస్తుతం మూడు పార్టీలకు చెందిన నేతలు ఉన్నప్పటికీ అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం చూస్తే మూడింటికి మూడూ వైఎస్సార్సీపీ గెలుపొందే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మరోసారి కొనసాగింపు ఉంటుందని, ఆయనతో పాటు మరో ఇద్దరికి చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.
వైవీ సుబ్బారెడ్డికి కూడా చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరితో పాటు సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని మరొకరికి చోటు కల్పించవచ్చు. ఇక తెలంగాణలో మూడు స్థానాలు బీఆర్ఎస్ నుంచి ఖాళీ అవుతుండగా.. వాటిలో రెండు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. ఒకటి బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం.
ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు మరోసారి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్ సైతం లోక్‌సభ బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
More Stories
ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ గడువు పొడిగింపు!
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది