జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ `కనిపించడం లేదు’!

మనీలాండరింగ్ విచారణకు సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బృందం సోమవారం ఢిల్లీ నివాసాన్ని సందర్శించగా ఆయన ‘తప్పిపోయినట్లు’ గుర్తించారు. అయితే, దానితో సోరెన్ ఆచూకీకి సంబంధించి ఏర్పడిన “గందరగోళాన్ని” జేఎంఎం నాయకత్వం కొట్టిపారవేస్తూ ఆయన బుధవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరవుతానని పేర్కొంది.
 
జనవరి 31న మధ్యాహ్నం 1 గంటలకు తన రాంచీ నివాసంలో సోరెన్ తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు ఈడీకి తెలిపినట్లు తెలిపారు.  భూ కుంభకోణం కేసులో సోరెన్‌కు సమన్లు జారీచేయడం ఇది పదోసారి. సోమవారం ఉదయం 9 గంటలకు దక్షిణ ఢిల్లీలోని 5/1 శాంతి నికేతన్ భవనంలో ఉన్న సోరెన్ నివాసానికి ఈడీ అధికారులు వచ్చిన తర్వాత ఈ నాటకం బయటపడింది.
 
ముఖ్యమంత్రి ఆచూకీ లభించకపోవడంతో ఏజెన్సీ అధికారులు దాదాపు 13 గంటలకు పైగా సోదాలు చేశారు. సోరెన్ నివాసం నుంచి కొన్ని పత్రాలతోపాటు హర్యానాలో రిజిస్టర్ అయిన బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈడీ అధికారులు ఇప్పటికే జార్ఖండ్‌లోని ఆయన అధికారిక నివాసాన్ని కూడా సందర్శించారు.
 
“ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసానికి ఒక ఈడీ బృందం వెళ్లగా ఆయన అక్కడ లేకపోవడంతో ఆయనను ప్రశ్నించలేకపోయింది. మరికొన్ని బృందాలు కూడా జార్ఖండ్ భవన్, మరికొన్ని ప్రదేశాలకు వెళ్లినా ముఖ్యమంత్రిని కనుగొనలేకపోయారు” అని అధికార వర్గాలు తెలిపాయి. మరోవంక, సీఎం హేమంత్ సోరెన్ ఎక్కడ ఉన్నారన్నది తెలియడం లేదు. అధికార జేఎంఎం ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి పొద్దు పోయే వరకూ సీఎం నివాసం వద్దే వేచి ఉన్నారు. రాంచీకి సీఎం ఎప్పుడు వస్తారన్న విషయమై జేఎంఎం వర్గాలు నోరు మెదపడం లేదు.
సొరేన్‌ కోసం ఈడీ అధికారులు సోమవారం జార్ఖండ్‌ భవన్‌కు, మోతీలాల్‌ నెహ్రూ మార్గ్‌లోని సొరేన్‌ తండ్రి నివాసానికి వెళ్లారు. కానీ ఆయన ఈ రెండు చోట్ల లేరు. ఆయన చార్టర్డ్‌ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో పార్క్‌ చేసి ఉంది. కొందరు ఈడీ అధికారులు సోమవారం రాత్రి వరకు ఆయన నివాసం వెలుపల తిష్ఠ వేశారు. అయితే ఇప్పటివరకు ఆయన ఆచూకీ లేకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
 
పార్టీ ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యక్తిగత పని మీద ఢిల్లీకి వెళ్లారని, ఆయన తిరిగి వస్తారని చెప్పారు. తాము జనవరి 31న విచారణకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమను స్థలం, సమయం అడిగారని, ఆ రోజు సీఎం నివాసంలో మధ్యాహ్నం 1 గంటకు అని తెలిపామని తెలిపారు. అయినా, ఇప్పుడు ఈ గందరగోళం అంతా ఎవరు సృష్టిస్తున్నారు? అని ప్రశ్నించారు. 
 
 అయితే, ఈడీ దర్యాప్తుకు భయపడి ముఖ్యమంత్రి గత 18 గంటలుగా పరారీలో ఉన్నారని, జార్ఖండ్ విశ్వసనీయత,  ప్రతిష్ట ప్రమాదంలో పడిందని గుర్తించాలని గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను బిజెపి జార్ఖండ్ యూనిట్ కోరింది.
 
“మీడియా వర్గాల సమాచారం ప్రకారం, అర్థరాత్రి హేమంత్ జీ, చెప్పులు ధరించి, ఒక షీట్‌తో ముఖాన్ని కప్పుకుని, తన ఢిల్లీ నివాసం నుండి కాలినడకన పారిపోయాడు. ఆయనతో పాటు ఢిల్లీకి వెళ్లిన స్పెషల్ బ్రాంచ్ అధికారి అజయ్ సింగ్ కూడా తప్పిపోయారు” అని జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో ఆరోపించారు.
 
వారిద్దరి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి. అప్పటి నుంచి వారి కోసం ఈడీ, ఢిల్లీ పోలీసులు వెతుకుతున్నారు. ముఖ్యమంత్రి భద్రత విషయంలో ఇంత నిర్లక్ష్యానికి ఉదాహరణ మరొకటి ఉండదని మాజీ ముఖ్యమంత్రి మరాండీ విస్మయం వ్యక్తం చేశారు.
 
ఈ కేసులో జనవరి 20న రాంచీలోని ఆయన అధికారిక నివాసంలో సోరెన్‌ను ఈడీ ప్రశ్నించింది. జనవరి 29 లేదా జనవరి 31వ తేదీల్లో విచారణకు తన లభ్యతను నిర్ధారించాలని కోరుతూ తాజాగా సమన్లు పంపగా, సోరెన్ ఈ-మెయిల్ పంపారు.  కానీ తేదీ లేదా సమయాన్ని నిర్ధారించలేదని ఈడీ వర్గాలు తెలిపాయి.
 
రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అంతరాయం కలిగించే విధంగా “రాజకీయ అజెండాతో” ఈడీ వ్యవహరిస్తున్నదని సొరేన్ ఆ సంస్థకు పంపిన ఇమెయిల్‌లో సోరెన్ ఆరోపించారు. జనవరి 31 లేదా అంతకంటే ముందు తన స్టేట్‌మెంట్‌ను మళ్లీ రికార్డ్ చేయాలని పట్టుబట్టడం దురుద్దేశ్యంతో కూడుకొన్నదిగా విమర్శించారు. 
 
కాగా, జనవరి 31న రాంచీ నివాసంలో తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి అంగీకరిస్తూ, అంతకు ముందు జనవరి 20న ఏడు గంటలపాటు రికార్డు చేసిన వీడియోను కోర్టులో సమర్పించేందుకు సిద్ధంగా ఉంచాలని ఈడీకి పంపిన ఇమెయిల్ లో కోరారు.
అయితే,  సీఎంకు ఈడీ సమన్లు పంపిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని గమనిస్తున్నట్లు జార్ఖండ్‌ గవర్నర్‌ చెప్పారు. “రాజ్యాంగ పరిరక్షకుడిగా నేను మొత్తం పరిస్థితిని గమనిస్తున్నాను. ఇది గవర్నర్ పని, నేను చేస్తున్నాను. అది వచ్చినప్పుడు మేము వంతెనను దాటుతాము” అని ఆయన విలేకరులతో పేర్కొన్నారు.
 
జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ “చక్కగా రూపొందించిన కుట్ర” ప్రకారం సొరేన్ చుట్టూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారనే భావన కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకోసం `ముఖ్యమంత్రి తప్పిపోయారు’ అనే దుష్ప్రచారం చేస్తున్నారని ఠాకూర్ విమర్శించారు.