డ్రాగన్ కు మింగుడుపడని భారత్‌- ఫ్రాన్స్ ఒప్పందాలు

భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత్‌కు వచ్చిన సందర్భంగా భారత్, ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడం మన పొరుగున ఉన్న చైనాకు మింగుడు పడటం లేదు. దీంతో తీవ్ర కలవరంలో మునిగిపోయిన డ్రాగన్ ఫ్రాన్స్‌కు మరింత దగ్గరయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఏకంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రంగంలోకి దిగుతున్నారు.
 
రక్షణ రంగంలో భారత్ ఫ్రాన్స్ ఉమ్మడి సహకారంపై ప్రధాని నరేంద్ర మోదీ, ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీతో పాటు సైనిక అవసరాలకు సాంకేతిక సహకారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఓ రోడ్‌మ్యాప్‌ రూపకల్పనపై ఇరు దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. 
 
దీంతో పాటు వ్యూహాత్మక హిందూ మహా సముద్రం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో రెండు దేశాల పరస్పర సహకారంపైనా మెక్రాన్‌, మోదీ చర్చలు జరిపారు. ఈ పరిణామాలే ప్రస్తుతం చైనాను ఆందోళనకు గురి చేసినట్లు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వెంటనే ఫ్రాన్స్‌తో తమ బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందు కోసం స్వయంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రకటన చేశారు.
 
చైనా, ఫ్రాన్స్‌ మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా చైనా రాజధాని బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో షీ జిన్‌పింగ్‌ మాట్లాడారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ మానవాళి భద్రత, అభివృద్ధి, శ్రేయస్సు, శాంతి కోసం ఫ్రాన్స్, చైనాలు సంయుక్తంగా కొత్త మార్గాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని జిన్‌పింగా ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
చైనా, ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తమ దేశం ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుందని గుర్తు చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ బంధాన్ని మరింత ఎక్కువ చేసుకునేందుకు ఈ 60 ఏళ్ల వేడుక మంచి అవకాశమని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.
 
ఆ తర్వాత మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఫ్రాన్స్‌ నుంచి అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడాన్ని చైనా పెంచుకుంటుందని తెలిపారు. ఫ్రాన్స్ సేవలను మరింత పెంచుకుంటామని తేల్చి చెప్పారు. చైనా కంపెనీలకు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ సర్కారు కూడా ఇలాంటి వ్యాపార అవకాశాలనే కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు వాంగ్ యీ వెల్లడించారు. 
 
అయితే భారత్‌తో ఫ్రాన్స్ ఇటీవల చేసుకున్న ఒప్పందాలు, పెరుగుతున్న ద్వైపాక్షిక బంధంతో చైనా అప్రమత్తమైనట్లు ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రక్షణ పరంగా ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందాలు కుదుర్చుకోవడం చైనాకు ఏ మాత్రం నచ్చడం లేదు.