మాల్దీవుల అధ్యక్షుడికి అభిశంసన గండం

ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్‌ ముయిజ్జు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండిపి) అభిసంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సంతకాలు సేకరిస్తోంది.  ఎండీపీకి చెందిన ఎంపీ ఈ విషయాన్ని చెప్పినట్లు స్థానిక మీడియా సంస్థ ది సన్‌ తెలిపింది. 
 
డెమోక్రాట్‌ల భాగస్వామ్యంతో ఎండీపీ సంతకాలు సేకరించినట్లు వెల్లడించింది. అధ్యక్షుడి అభిశంసన తీర్మానానికి ఎండీపీ, డెమోక్రాట్‌ల ప్రతినిధులతో సహా మొత్తం 34 మంది సభ్యులు మద్దతు ఇచ్చినట్లు మాల్దీవుల ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ అధాధు పేర్కొంది. మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం అభిశంసన తీర్మానం ఆమోదం పొందాలంటే   56 మంది ఓట్లు రావాల్సి వుంది.  దీంతో మిగిలిన ఓట్ల కోసం ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయి.
 
అధ్యక్షుడైన ముయిజ్జూ న్యూఢిల్లీతో సంబంధాలకు విఘాతం కలిగించిన నేపథ్యంలో తాము ఈ తీర్మానాన్ని తీసుకొచ్చామని మాల్దీవుల పార్లమెంటు సభ్యుడొకరు తెలిపారు. అంతకుముందు జనవరి 8న పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా అధ్యక్షుణ్ని గద్దె దించాలని కోరారు. 
 
మాల్దీవులు విదేశాంగ విధాన స్థిరత్వాన్ని నిలబెట్టడానికి, పొరుగు దేశాలకు దూరం కాకుండా ఉండేందుకు ఇదెంతో అవసరమని అజీమ్ స్పష్టం చేశారు. అభిశంసన తీర్మానం విషయమై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాదోపవాదనలతో మాల్దీవులు పార్లమెంట్ అట్టుడుకుతోంది. భారత్‌ను దూరం చేసుకోవద్దని విపక్ష నేతలు మాల్దీవులు ప్రభుత్వానికి ప్రతిపక్షాలు హితవు పలుకుతున్నాయి. 
 
కాగా, అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ప్రభుత్వం కేబినెట్‌ నిర్ణయంపై నిర్వహించిన ఓటింగ్‌ కారణంగా ఆమోదం కోసం ఆదివారం మాల్దీవుల పార్లమెంట్‌ సమావేశంలో కీలక ఓటింగ్‌ సందర్భంగా బాహాబాహీ జరిగింది. స్పీకర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష సభ్యులపై అధికార పక్ష సభ్యులు దాడి చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. 
 
ఈ నేపథ్యంలో సోమవారం పార్లమెంట్‌ సమావేశం సందర్భంగా భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎంపిల తోపులాటలు, ముష్టిఘాతాల దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు అధికార సభ్యులు పార్లమెంటుకు అంతరాయం కలిగించడంపై ప్రధాన ప్రతిపక్షం ఎండీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఎంపీల తీరు ఇలాగే కొనసాగితే హోంమంత్రి అలీ ఇహుసన్, రక్షణ మంత్రి మహమ్మద్ ఘసన్ మౌమూన్‌ ఆమోదాన్ని నిరాకరించాలని నిర్ణయించింది.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటనకు సంబంధించిన ఫోటోలపై మాల్దీవులు డిప్యూటీ మంత్రి మరియం షియునా అనుచిత వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. దిద్దుబాటు చర్యగా ముగ్గురు జూనియర్ మంత్రులను తొలగించినా ఉద్రిక్తలు సడలడం లేదు. ఈ లోగా మాల్దీవుల్లో ఉన్న భారతీయ సైనికులను వెనుకకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం అల్టిమేటం జారీచేయడంతో భారత్ – మాల్దీవుల దౌత్య సంబంధాలలో ప్రతిష్టంభన ఏర్పడింది.