అండర్19 ప్రపంచకప్2024లో టీమిండియా హ్యాట్రిక్

అండర్ 19 ప్రపంచకప్ 2024లో టీమిండియా వరుసగా మూడో మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. అగ్రరాజ్యం అమెరికా జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 201 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 
 
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. అర్షిణి కులకర్ణి(118 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108) సెంచరీతో రాణించగా ముషీర్ ఖాన్(76 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 73) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 
 
అమెరికా బౌలర్లలో అతీంద్ర సుబ్రమణియన్(2/45) రెండు వికెట్లు తీయగా, ఆర్య గార్గ్, ఆరిన్ నద్కర్ణి, రిషి రమేశ్ తలో వికెట్ తీసారు. గత మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన ముషీర్ ఖాన్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. శతకాన్ని అందుకోలేకపోయినా హాఫ్ సెంచరీ సాధించాడు. 
 
కెప్టెన్ ఉదయ్ శరణ్(35), సచిన్ ధాస్(20) కీలక ఇన్నింగ్స్ ఆడారు. తెలుగు తేజం అరవెల్లి అవినాష్(7 బంతుల్లో సిక్సర్‌తో 12 నాటౌట్) మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులే చేసి ఘోర పరాజయం చవిచూసింది. 
 
ఉత్కర్ష శ్రీవాస్తవా(40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో నమాన్ తివారీ(4/20) నాలుగు వికెట్లు తీయగా రాజ్ లింబాణి, సౌమీ పాండే, మురుగణ్ అభిషేక్, ప్రియాన్షు మోలియా తలో వికెట్ తీశారు. భారత బౌలర్ల ధాటికి అమెరికా బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 
 
ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలోనూ భారీ విజయాలే నమోదు చేసింది. బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో గెలిచిన యంగ్ ఇండియా  ఐర్లాండ్, అమెరికాను 201 పరుగుల భారీ స్కోర్‌తో ఓడించింది.