రిజర్వేషన్‌ పోస్టులు డీ-రిజర్వేషన్‌ చేయడంలేదు

రిజర్వ్ చేసిన ఉద్యోగాలు వేటిలోను రిజర్వేషన్ రద్దు చేయలేదని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ (ఎంఒఇ) ఆదివారం స్పష్టం చేసింది. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కేటగరీల నుంచి తగినంత మంది అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో ఆ కేటగరీల కోసం రిజర్వ్ చేసిన ఖాళీని రిజర్వేషన్ లేనిదిగా ప్రకటించవచ్చునని యుజిసి ముసాయిదా మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించిన తర్వాత విద్యా మంత్రిత్వశాఖ ఆ వివరణ ఇచ్చింది.

2019లో చేసిన చట్టం ప్రకారం కేంద్ర విద్యా సంస్థల్లో టీచర్‌ క్యాడర్‌లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో అన్ని పోస్టులకు రిజర్వేషన్‌ ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. సెంట్రల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌(రిజర్వేషన్‌ ఇన్‌ టీచర్స్‌ క్యాడర్‌) చట్టం-2019 అమల్లోకి తర్వాత ఏ రిజర్వేషన్‌ పోస్టును డీ రిజర్వ్‌ చేయకూడదని, ఈ మేరకు చట్టప్రకారం ఖాళీల భర్తీ చేపట్టాలని ఆదేశాలు జారీచేశామని ఎక్స్‌ పోస్టులో తెలిపింది. 

మరోవైపు కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పోస్టులను డీ రిజర్వ్‌ చేయబోమని యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ స్పష్టత ఇచ్చారు. రిజర్వ్‌ క్యాటగిరీలోని బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేసేందుకు ఉన్నత విద్యా సంస్థలు చర్యలు కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేశారు.  మున్ముందు కూడా ఆ విధంగా రిజర్వేషన్‌ను రద్దు చేయడం జరగదని జగదీశ్ కుమార్ హామీ ఇచ్చారు.

కాగా, ఉన్నత విద్యా సంస్థల ఉద్యోగాలలో ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలకు ఇచ్చిన రిజర్వేషన్‌ను నిలిపివేయడానికి ‘కుట్ర’ జరుగుతోందని, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనుల సమస్యలపై మోడీ ప్రభుత్వం ‘ప్రతీక రాజకీయాలకు’ పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. జెఎన్‌యు విద్యార్థుల యూనియన్ (జెఎన్‌యుఎస్‌యు) కూడా ఆ విషయమై నిరసన నిర్వహించి, యుజిసి చైర్మన్ ఎం జగదీశ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసింది.

ఇలా ఉండగా, అత్యవసర సందర్భాల్లో రిజర్వేషన్‌ పోస్టుకు సరైన అభ్యర్థులు లభించనప్పుడు గ్రూప్‌ ఏ పోస్టులను అన్‌రిజర్వ్‌డ్‌గా మార్చే విధానం ప్రస్తుతం ఉన్నది. తాజాగా గ్రూప్‌ బీ, సీ, డీ పోస్టులను కూడా జాబితాలోకి తీసుకురావాలని యూజీసీ ప్రతిపాదించింది. గ్రూప్‌ ఏ, బీ పోస్టులను డీ రిజర్వేషన్‌లోకి మార్చాలంటే కేంద్ర విద్యాశాఖ అనుమతి తీసుకోవాలని, గ్రూప్‌ సీ, డీ పోస్టులకయితే యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఆమోదిస్తే సరిపోతుందని ముసాయిదాలో స్పష్టంగా పేర్కొన్నారు.