అయోధ్య భద్రతకు ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్

* తొలి ఆరు రోజుల్లో 18.75 లక్షల మంది  సందర్శన
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం గర్బగుడిలో బాలక్ రామ్ ప్రాణప్రతిష్ఠ పవిత్రోత్సవం తరువాత దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. బాలరాముడ్ని కనులారా చూసి తరించేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అయోధ్య రామ మందిరం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇటీవల బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సమయంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉన్నారు.
సీఆర్పీఎఫ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) దళాలు కూడా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాయి. ఆ సమయంలో ఏజెన్సీల నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగించారు. సొంతంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భావించారు. ఇజ్రాయెల్ నుంచి 10 యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలు చేశారు. త్వరలో వాటి సేవలను ఉపయోగిస్తామని చెబుతున్నారు. 

యాంటీ డ్రోన్ వ్యవస్థ 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను గుర్తిస్తాయి. ఆ పరిధిలో శత్రువుకు చెందిన డ్రోన్లను నిర్వీర్యం చేస్తాయని వివరించారు. యాంటీ డ్రోన్ల ద్వారా ప్రమాదాన్ని గుర్తించి, వేగంగా నిర్ణయం తీసుకునేందుకు పోలీసులకు అవకాశం ఉంటుంది. శత్రువుకు చెందిన డ్రోన్లను హ్యాక్ చేసే వీలు కూడా ఉంటుంది.

రాష్ట్రంలో సున్నిత ప్రాంతాలు అయిన లక్నో, వారణాసి, మథురలో కూడా యాంటీ డ్రోన్లను ఇన్ స్టాల్ చేస్తున్నామని, అవసరాన్ని బట్టి మిగిలిన చోట్ల నెలకొల్పుతామని స్పష్టంచేశారు. సామాన్య భక్తులను దర్శనాలను అనుమతించిన తర్వాత ఆరు రోజుల వ్యవధిలో 18.75 లక్షల మంది యాత్రికులు అయోధ్యకు వచ్చినట్టు ఉత్తర ప్రదేశ్ అధికారులు తెలిపారు. 

దర్శనాలకు అనుమతించిన మొదటి రోజు జనవరి 23న 5 లక్షల మంది భక్తులు అయోధ్య రామాలయాన్ని దర్శించుకోవడం మరో విశేషం. తర్వాత రెండు రోజులు తగ్గినా వరుస సెలవులు కావడంతో అయోధ్య నగరి భక్తజన సందోహంగా మారింది. జనవరి 24న 2.5 లక్షలు, జనవరి 25న 2 లక్షల మంది దర్శించుకున్నారు.

రిపబ్లిక్ డే జనవరి 26న 3.5 లక్షలు, జనవరి 27న 2.5 లక్షల మంది, జనవరి 28న 3.25 లక్షల మంది భక్తులు రామ్ లల్లా దర్శనానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. దేశం నలుమూలల నుంచి శ్రీరాముని దర్శనం, ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు రోజూ కనీసం 2 లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. జై శ్రీరామ్ నినాదం అయోధ్య నగరం మార్మోగిపోతోంది.