* ఖాతరు చేయని ఇజ్రాయిల్
గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతున్నదంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం (ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)) శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది. గాజాలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపేయాలంటూ ఇజ్రాయెల్‌ను ఆదేశించింది.
దీని కోసం అవసరమైన అన్ని చర్యలను వెంటనే చేపట్టాలని పేర్కొంది. గాజాలో జరిగిన దాడుల్లో గాయపడ్డ పౌరులకు మానవతా సాయాన్ని కొనసాగించేలా చూడాలని కూడా కోర్టు సూచించింది. తమ ఆదేశాలకు అనుగుణంగా తీసుకొన్న చర్యలపై నివేదికను నెలలోగా సమర్పించాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించిన న్యాయస్థానం.
గాజాలో ప్రాణనష్టం, నష్టాన్ని పరిమితం చేయడానికి ఇజ్రాయెల్ తక్షణ, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఐసిజె డిమాండ్ చేసింది. పాలస్తీనియన్లను రక్షించడానికి అదనపు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ప్రాంతానికి అత్యవసరంగా అవసరమైన ప్రాథమిక సేవలు, మానవతా సహాయాన్ని అందించడానికి అనుమతించాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించింది.
గాజాలో నరమేధానికి ప్రత్యక్ష ప్రేరేపణను నిరోధించి, శిక్షించాలని ఇజ్రాయెల్‌కు ఐసిజె ఆదేశించడం తీర్పులోని కీలక అంశం పాలస్తీనియన్ల హక్కులను పరిరక్షించడానికి, మారణహోమ చర్యలను నిరోధించడానికి అంతర్జాతీయ చట్టపరమైన బాధ్యతలను సమర్థించడం ప్రాముఖ్యతను కోర్టు స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్ ఆదేశాలను పాటించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఒక నెలలోగా కోర్టుకు నివేదించాలని ఆదేశించింది.
తమ పరిధి మేరకు మాత్రమే ఈ ఆదేశాలనిస్తున్నట్టు వెల్లడించింది. అయితే, కాల్పుల విరమణకు ఆదేశాలివ్వాలంటూ దక్షిణాఫ్రికా చేసిన విజ్ఞప్తిపై కోర్టు స్పందించలేదు. గాజాలో ఇజ్రాయెల్ మానవ హననానికి పాల్పడుతున్నదంటూ దక్షిణాఫ్రికా ఐసీజేకు ఫిర్యాదు చేసింది. గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ సైనిక చర్య భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారి తీస్తున్నదని, దానిని ఆపేందుకు మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థలు, అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. దక్షిణాఫ్రికా ఐసీజే గడప తొక్కడంపై ఇప్పటికే ఇజ్రాయెల్ స్పందించింది. ఈ ఫిర్యాదుకు లీగల్ ఫౌండేషన్ లేదని స్పష్టం చేసింది. రాజకీయ లబ్ధిలో భాగంగానే దక్షిణాఫ్రికా ఈ కేసు వేసిందని ఆరోపించింది.
ఇలాంటి ఆరోపణలను ఆధారం చేసుకొని ఐసీజే ఇచ్చిన ఈ ఆదేశాలకు తాము కట్టుబడి ఉండబోమని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్‌ను అంతమొందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఐసీజే ఆదేశిస్తే ఇజ్రాయెల్‌తో యుద్ధంలో కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని గురువారం హమాస్ ప్రకటించింది. అయితే, ఇజ్రాయెల్ సైన్యం కూడా దాన్ని అమలు చేయాలని షరతు విధించింది.
2022లో ఉక్రెయిన్- రష్యా మధ్య మొదలైన యుద్ధంపై కూడా ఐసీజే కీలక ఆదేశాలిచ్చింది. దాడులను వెంటనే నిలిపేయాల్సిందిగా రష్యాను ఆదేశించింది. అయితే, ఆ ఆదేశాలను రష్యా పట్టించుకోలేదు. జెరూసలెంలో ఉండే అల్-అఖ్సాను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. దీన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలన్నదే తమ లక్ష్యమని ఇప్పటికే హమాస్ ప్రకటించింది. అయితే, అల్-అఖ్సా ఇజ్రాయెల్ సేనల రక్షణ వలయంలో ఉన్నది.
More Stories
అండర్-19 ప్రపంచకప్.. సూపర్ సిక్స్‌లోకి యువ భారత్
దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం