ఎబివిపి నేతను ఈడ్చుకెళ్ళిన పోలీసులలపై మహిళా కమిషన్ ఆగ్రహం

హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో కానిస్టేబుళ్లు ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీరాణిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్‌ విద్యార్థినిపై మహిళా పోలీసుల చర్య అమానుషమంటూ మండిపడింది.  ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీని హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ని వెనక్కి తీసుకోవాలని బుధవారం శాంతియుతంగా విద్యార్థులు నిరసన చేపట్టగా పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు. దీంతో ఝాన్సీ పరుగెత్తుతుండగా బైక్‌పై వెంబడించిన ఇద్దరు మహిళా పోలీసులు సదరు విద్యార్థిని జట్టుపట్టి ఈడ్చుకెళ్లారు.

దాంతో యువతి అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. అయినా ఆమె జుట్టు వదలకుండా ముందుకు లాక్కుంటూ వెళ్లారు. దీంతో ఆమెకు చేతులు, కాళ్లు, శరీరముందు భాగంలో గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, ఎబివిపి కార్యదర్శి రాష్ట్ర ఝాన్సీపై పోలీసులు వ్యవరించిన తీరు  బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలు బాగుపడుతారని జయశంకర్ సార్ పేరుతో స్థాపించిన యూనివర్సిటీలో విద్యార్థులను చెల్లాచెదురు చేసి పోలీసులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అంటూ ఆమె మండిపడ్డారు.

విద్యార్థినేత ఝూన్సీని జుట్టు పట్టుకుని లాక్కెళుతూ దాడికి పాల్పడటం దారుణ ఈ అంశంపై ముఖ్మంటూ యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎబివిపి నాయకురాలిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళిన పోలీసులపై ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. విద్యార్థి నాయకురాలపైనే పోలీసులు ఇలా వ్యవరిస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ఆమె విస్మయం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై  న్యాయ విచారణ జరిపించాలని బిజెపి ఎంపీ, ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు