గవర్నర్ కోటాలో ఎమ్యెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెస‌ర్ కోదండ రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్  పేర్ల‌ను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దానితో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న కోదండ రామ్ ఎట్టకేలకు ప్రజాప్రతినిధి కాగలిగారు. 

ఉద్యమ సందర్భంగా కేసీఆర్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల జేఏసీకి కన్వీనర్ గా వ్యవహరించి, కేసీఆర్ కు బాసటగా నిలిచినా ఆయన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కీలక పదవి లభిస్తుందని ఎదురు చూసి నిరాశకు గురయ్యారు. 2014 ఎన్నికలలో లోక్ సభకు పోటీచేయాలనే కోర్కె నెరవేరలేదు. కనీసం రాజ్యసభకు కూడా వెళ్లలేక పోయారు.

దానితో క్రమంగా కేసీఆర్ కు దూరమై ప్రతిపక్షాలతో కలిసి కార్యక్రమాలలో పాల్గొంటూ వచ్చారు. 2018 ఏప్రిల్ లో సొంతంగా తెలంగాణ జనసమితి (టీజేఎస్) అనే ప్రాంతీయ పార్టీని స్థాపించి, 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐలతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. కానీ ఆయన పార్టీ ఎన్నికల్లో ఎలాంటి ముద్ర వేయలేక ఆ తర్వాత ఆ పార్టీ నిర్వీర్యమైంది. సొంతంగా కోదండరాం ఓటమి చెందారు. 

 అయితే కోదండరామ్ మాత్రం తన వ్యక్తిగత హోదాలో తన ఉనికి కాపాడుకొంటూ వచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరామ్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరాం సేవలను తమ ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకుంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఆ మేరకు ఇప్పుడు ఎమ్యెల్సీగా నామినేట్ చేశారు.

అయితే, రాజ్యసభకు పంపాలని లేదా లోక్ సభ ఎన్నికలలో పోటీచేయించాలనే ప్రతిపాదనలు ముందుకొచ్చినా కాంగ్రెస్ నాయకత్వం సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య సలహాదారునిగానో, టీఎస్పీఎస్సీ  చైర్మన్ గానో, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గాని లేదా మంత్రివర్గంలో చేర్చుకోవడంలో జరుగుతుందనే ప్రచారం కూడా జరిగింది.