ధరణి పోర్టల్ తో 23 లక్షల ఎకరాల అక్రమ స్వాధీనం

ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకొని సుమారు 23 లక్షల ఎకరాల భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన కోదండరెడ్డి కమిటీ ప్రాథమికంగా నిర్ధ్దారణకు వచ్చినట్లు తెలిసింది.  ధరణి పోర్టల్ తప్పుల తడకగా, లోపభూయిష్టంగా ఉన్నదని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడినట్లు తెలిసింది. 

18 లక్షల ఎకరాలు పార్ట్ బి నిషేధిత జాబితాలో ఉన్నాయని అధి కారికంగా పేర్కొన్నప్పటికీ, అనధికారికంగా 23లక్షల ఎకరాలు పార్ట్‌బిలో ఉన్నట్లు కమిటీ దృష్టికి వచ్చింది. 35 మాడ్యుల్స్ తెచ్చినా ప్రయోజనం లేదని, కలెక్టర్లు సైతం సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని కమిటీ స్పష్టం చేసింది.  ధరణి కమిటీలో ఎం.కోదండరెడ్డి, ఎం. సునీల్ కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిట్టల్, మధుసూదన్‌లు ఉన్నారు.

ఈ కమిటీ రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్లతో జరిపిన సమావేశంలో ధరణి పోర్టల్ మూలంగా సామాన్య రైతులే కాకుండా చివరకు కలెక్టర్ స్థాయి అధికారులు కూడా ముద్దాయిలుగా, నేరస్తులుగా మారిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి మూలంగా జరిగిన అనేక తప్పులకు తమను బాధ్యులుగా చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 

తాము కూడా ధరణి బాధితులమని  పేర్కొంటూ ఈ సమస్యల బారి నుండి తమను కాపాడాలని కోరారు. ధరణి ఏర్పాటుకు ముందు గత ప్రభుత్వం మూడు కమిటీలను వేసిందని, అయితే ఆ కమిటీల సిఫారసులను ధరణిలో చేర్చలేదని కమిటీ నిగ్గుతేల్చింది.ఈ సమావేశం నుంచే అన్ని జిల్లాల కలెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్లు తెలిసింది.  

రెండు జిల్లాల్లో ఎంపిక చేసిన మండలాల్లో పర్యటించి ధరణి మాడ్యూల్‌ను శాంపిల్‌గా ఈ కమిటీ తనిఖీ చేసే అవకాశం ఉంది. ఈ గ్రామాల పర్యటన తర్వాత ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు కమిటీ తన కసరత్తు వేగవంతం చేసింది. ధరణి సమస్యపై ఈ నెల 27న అటవీ, గిరిజన, వ్యవసాయ అధికారులతో సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది.