మాల్దీవుల అధ్యక్షుడి `భారత్ వ్యతిరేకత’పై ప్రతిపక్షాల హెచ్చరిక

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు అనుసరిస్తున్న‘భారత వ్యతిరేక’ వైఖరి తమ దేశానికి హానికరంగా మారవచ్చని ఆ దేశంలోని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు హెచ్చరించాయి.  మహ్మద్‌ మొయిజ్జు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ  మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండిపి), డెమొక్రాట్లు సంయుక్తంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

దేశ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు మాల్దీవులకు ‘అత్యంత హానికరం’ అని ఆ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశాయి.  ఎండిపి  ఛైర్‌పర్సన్‌ ఫయాజ్‌ ఇస్మాయిల్‌, పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ అహ్మద్‌ సలీమ్‌, డెమోక్రాట్‌ చీఫ్‌ ఎంపి  హసన్‌ లతీఫ్‌, పార్లమెంటరీ గ్రూప్‌ లీడర్‌ అలీ అజీమ్‌లు సంయుక్తంగా   నిర్వహించిన మీడియా  సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

మిత్రదేశాన్ని వేరు చేయడం వల్ల మాల్దీవుల దీర్ఘకాలిక అభివృద్ధికి  తీవ్ర నష్టం వాటిల్లుతుందని పరోక్షంగా భారత్‌నుద్దేశించి వారు వ్యాఖ్యానించారు. మాల్దీవుల స్థిరత్వంతో పాటు భద్రతకు హిందూ మహాసముద్రం భద్రత చాలా ముఖ్యమైనదని, దేశంలో ముయిజ్జూ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

భారత్‌తో చారిత్రాత్మక సహకారం వైదొలగడం వల్ల దేశ సుస్థిరత, ప్రగతికి విఘాతం కలిగే అవకాశం ఉందని  స్పష్టం చేశారు. విదేశాంగ విధానంలో భాగంగా మాల్దీవుల ప్రభుత్వం సాంప్రదాయక భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేయాలని వారు హితవు చెప్పారు.

ఈ వారం ప్రారంభంలో మాల్దీవులు ఒక చైనా నిఘా నౌకను తమ జలాల్లోకి అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నౌక మాల్దీవుల జలాల్లో ఎటువంటి పరిశోధన నిర్వహించదు. ఈ వార్తపై మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ తమ ద్వీప దేశం ఎల్లప్పుడూ ‘స్నేహపూర్వక దేశాల’ నౌకలను స్వాగతిస్తుందని ప్రకటించారు.