మనుష్యులను రాక్షసులుగా మార్చే ప్రమాదకర వైరస్!

కరోనా వైరస్‌ సృష్టించిన విలయతాండవం నుంచి ఇంకా బయటపడకముందే అంతకుమించిన ప్రమాదకరమైన వైరస్‌లు మనుషులపైకి దండయాత్ర చేసేందుకు వస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. సోకిన వెంటనే మనుషులు రాక్షసుల్లా మారిపోయి, కాళ్లు, చేతులు వంకర్లు పోవడంతో పాటు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ, విచక్షణ, ఆలోచించే జ్ఞానం కోల్పోయి మృగాల్లా మారిపొతే భయంకర పరిణామాలకు దారితీసే ప్రమాదకర వైరస్ గురించిన కధనాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా ఆర్కిటిక్‌లోని మంచు వేగంగా కరిగిపోతుందని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్కిటిక్‌ మంచు కరిగిపోవడం వల్ల వచ్చే ప్రమాదాలపై పరిశోధన చేపట్టిన ఎయిక్స్‌ మార్సిల్లే పరిశోధకులకు వేల ఏండ్ల క్రితం ఆర్కిటిక్‌ మంచులో గడ్డకట్టుకుపోయిన ప్రమాదకరమైన వైరస్‌లు ఇంకా సజీవంగానే ఉన్నాయన్న విషయం వారి పరిశోధనల్లో వెల్లడైంది. 

భూతాపం కారణంగా మంచు కరిగిపోవడంతో ఇప్పుడు ఆ వైరస్‌లు బయటకు వస్తున్నాయని తెలిసింది. రష్యాలోని సైబీరియన్‌ ప్రాంతంలో కరుగుతున్న మంచు నమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు 13 కొత్త తరహా వైరస్‌లను 2022లో గుర్తించారు. వీటిపై తాజాగా పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు వీటిలో 48,500 ఏండ్ల క్రితం గడ్డకట్టుకుపోయిన జాంబీ తరహా వైరస్‌లు కూడా ఉన్నాయని గుర్తించారు.

ఈ వైరస్‌లు ఇంకా సజీవంగానే ఉన్నాయని, తొందరలోనే ఉనికిలోకి వచ్చే అవకాశం ఉందని  హెచ్చరిస్తున్నారు. ఆర్కిటిక్‌లోని మంచు కరిగిపోవడంతో అందులోని వైరస్‌లు ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోకి వెళ్తాయని, ముఖ్యంగా జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ముఖ్యంగా ఈ వైరస్‌ వ్యాప్తి దక్షిణ ప్రాంతాల్లో మొదలై ఉత్తర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని ఎయిక్స్‌ మార్సిల్లే పరిశోధకులు చెబుతున్నారు. ఈ జాంబీ వైరస్‌లు బయటకొస్తే పురాతన పోలయో తరహా అనారోగ్యాలు మళ్లీ వచ్చే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ వైరస్‌ల కారణంగా ఎటువంటి నష్టం జరుగుతుందనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ మానవాళి మనుగడకే ప్రమాదం ఉంటుందని మాత్రం హెచ్చరిస్తున్నారు.