‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన చైనా సైనికులు

* చైనాలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని చూసిన హిందువులు మంత్రముగ్ధులయ్యారు. భారత్‌లో ప్రతి గ్రామంలో రాముడి పండుగ కనిపించింది. సోషల్ మీడియాలో జైశ్రీరామ్ నినాదం వినిపించింది. వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికులతో పాటు చైనా సైనికులు కూడా జైశ్రీరామ్ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఓ టేబుల్‌పై డ్రింక్స్, స్నాక్స్ ఉండగా ఇరువైపులా రెండు దేశాల సైనికులు నిలబడి ఉన్నారు. భారత దళాలు చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలకు జైశ్రీరామ్ నినాదాన్ని ఎలా పలకాలో చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది. భారత ఆర్మీ పలికినట్లుగా చైనా సైనికులు జైశ్రీరామ్ నినాదం ఇచ్చారు. అయితే ఈ వీడియో ఏ తేదీని అని స్పష్టంగా తెలియరాలేదు.

కానీ మూడు నెలల కిందటిగా భావిస్తున్నారు. భారత్- చైనా సరిహద్దుల్లో కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు ఉన్న విషయం తెలిసిందే. సమస్య పరిష్కారం కోసం ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి.  ఈ క్రమంలో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజున ఈ వీడియోను ఓ మాజీ సైనికుడు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ఇలా ఉండగా, చైనాలో అర్ధరాత్రి వేళ భారీ భూకంపం వచ్చింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్‌యాంగ్ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ తెలిపింది.  ఈ భూకంప తీవ్రత మన దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది.

ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాగా, చైనాలో భూకంపం కారణంగా కిర్గిజిస్తాన్‌-జిన్‌జియాంగ్‌ సరిహద్దుల్లో పలువురు గాయపడ్డారు. ఇండ్లు కూడా కూలిపోయాయని అధికారులు తెలిపారు.  భూకంపం కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిన్‌జియాంగ్ పరిధిలో 27 రైళ్లను రైల్వే శాఖ నిలిపివేసింది.

భూప్రకంపనలు సంభవించిన ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వాయవ్య చైనాలో మొత్తం 14 సార్లు భూమి కంపించిందని చైనీస్‌ మీడియా వెల్లడించింది. వాటి తీవ్రత 3.0 నుంచి అంతకంటే ఎక్కువగా నమోదయిందని పేర్కొన్నాయి.  అత్యధికంగా 5.3 తీవ్రత రికార్డయిందని తెలిపాయి. భూకంపం కేంద్రం ఉషు కౌంటీకి సమీపంలో ఉన్నదని వెల్లడించాయి. ఇక కజఖిస్థాన్‌లో కూడా 6.7 తీవ్రతతో భూమి కంపించిందని అత్యవసర శాఖ ప్రకటించింది. దీంతో దేశంలోని అతిపెద్ద నగరమైన అల్మటీలో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులు తీశారని పేర్కొంది.