హమాస్‌ దాడిలో 24 మంది ఇజ్రాయిల్ సైనికులు మృతి

హమాస్‌ మిలిటెంట్‌లతో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఇజ్రాయెల్‌ సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్‌ మిలిటెంట్లు ఆర్‌పీజీ లాంచర్‌ను ప్రయోగించడంతో 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. మరో దాడిలో మరో ముగ్గురు సైనికులు మరణించారు.  మొత్తం 24 మంది ఇజ్రాయెల్‌ సైనికులు ఈ దాడిలో మృతిచెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది.
హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత ఇంత భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి.  సెంట్రల్ గాజాలోని రెండు భవనాలను కూల్చేందుకు సోమవారం ఇజ్రాయెల్‌ సైనికులు పేలుడు పదార్థాలను అమర్చుతున్నారు.  అదే సమయంలో సమీపంలోని ట్యాంక్‌పైకి హమాస్‌ మిలిటెంట్‌లు గ్రనేడ్‌ను ప్రయోగించారు. దాంతో ఇజ్రాయెల్‌ సైనికులు అమర్చిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోయాయి.
రెండు భవనాలు కూలి సైనికుల మీద పడ్డాయి. ఇరవై ఒక్క మంది ఇజ్రాయెల్‌ సైనికులు శిథిలాల కింద పడి మరణించారు.  ఈ దాడికి కొన్ని గంటల ముందు గాజాలోని హమాస్ కేంద్ర నిలయంగా భావిస్తున్న ఖాన్‌ యూనిస్‌లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో 50 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు. రెండు వర్గాల మధ్య పోరులో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా ఇజ్రాయెల్ చర్యలు తీసుకోవాలని అమెరికా సూచించింది.

ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 25 వేలకు మందికి పైగా గాజా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల భవనాలను ఇజ్రాయెల్ సైన్యం నేలమట్టం చేసింది. 23 లక్షల మంది ప్రజలు గాజాను వదిలి ఇతర దేశాలకు వలస పోయారు. ఈ యుద్ధంతో గాజాలోని 85 శాతం ప్రజలు తమ సొంత ప్రాంతాలను వీడాల్సి వచ్చిందని, ప్రతి నలుగురిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని ఐరాస గణాంకాలు వెల్లడించాయి. 

అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్‌లు ఉగ్రదాడి జరిపి దాదాపు 240 మంది ఇజ్రాయెల్‌ పౌరులను తన చెరలో బంధించారు. ప్రపంచ దేశాల ఒత్తిడితో వారిలో కొందరు విడుదల కాగా దాదాపు 100 మంది బందీలుగానే ఉన్నారు. ఈ క్రమంలో బందీలందరూ విడుదలయ్యే వరకు, హమాస్‌ను అంతం చేసేవరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు చెబుతున్నారు.