రష్యా విమానం కూలి 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మృతి

రష్యా- ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యాకు చెందిన యుద్ధ రవాణా విమానం కుప్పకూలింది. రష్యన్ ఇల్యుషిన్ ఇఎల్-76 సైనిక రవాణా విమానం బుధవారం ఉక్రేనియన్ సరిహద్దు సమీపంలో కుప్పకూలింది. రష్యన్ బందీల కోసం మార్పిడి చేయడానికి 65 మంది ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలను తీసుకువెళుతున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ ఆర్ఐఎ తెలిపింది.
ఈ ఘటనలో 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు మృతి చెందారు. యుద్ధ ఖైదీలు, ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న రష్యా సైనిక విమానం ఉక్రెయిన్‌ సమీపంలోని బెల్గోరోడ్‌ ప్రాంతంలో కుప్పకూలిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.  ఉదయం 11 గంటల సమయంలో ఈ విమానం కుప్పకూలిందని పేర్కొంది.
అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొంది. ఘటనలో ఎవరైనా బ్రతికి బయటపడ్డారా? అని కూడా తెలియలేదని చెప్పింది. అయితే, అధికారులు విమానం కూలిపోవడానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. ప్రత్యేక సైనిక మిషన్‌ విమానం కూలిన ప్రాంతానికి బయలుదేరిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఆ విమానంలో క్షిపణులు చేరవేస్తున్నట్లు యుక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ప్రమాద కారణాల గురించి రష్యా, ఉక్రెయిన్ ప్రభుత్వాలు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. ఆ విమానం కూలిన ప్రాంతంలో భారీ పేలుడుతో కూడిన ఫోటోలు మీడియాలో కనిపిస్తున్నాయి.  రష్యా రిటైర్డ్ జనరల్, ఎంపీ అయినా అంధేరి కర్తపోలోవ్ ఆ విమానాన్ని మూడు క్షిపణులు కూల్చివేసిన్నట్లు చెప్పారు. అయితే అందుకు ఎటువంటి ఆధారం తెలపలేదు.