అయోధ్యలో పవన్ కళ్యాణ్ భావోద్వేగం

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు తాను భావోద్వేగానికి గురయ్యానని, ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో తన కళ్ల నుంచి నీళ్లు వచ్చాయని చెప్పారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింతగా పెంచిందని తెలిపారు. 

అయోధ్యలో రాముడి మందిరం కోసం కొన్ని తరాలుగా, కొన్ని శతాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయని, ఇప్పుడు వారందరికీ ఆశయం నెరవేరిందని అంటూ సంతోషం వ్యక్తం చేశారు.  ఇది ఒక రకంగా దేశాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.  “ఇది నాకు చాలా భావోద్వేగమైనది. ప్రాణప్రతిష్ఠ సమయంలో నా కళ్లలో నుంచి నీళ్లు రావడం ప్రారంభించింది. ఇది చాలా ఎమోషనల్. కొన్ని తరాల నుంచి దేశం ఎదుర్కొన్న బాధ ఇది. ఎట్టకేలకు ఇది నెరవేరింది. భారత్‍గా దేశాన్ని ఇది పటిష్టం చేస్తుంది. ఐక్యం చేస్తుంది” అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. సాధారణంగా తాము రాముడు, బాలాజీ కోసం తిరుమలకు వెళ్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇకపై రాముడి కోసం అయోధ్యకు వస్తానని తెలిపారు. ముఖ్యంగా దక్షిణాది నుంచి అయోధ్యకు ఎక్కువ మంది వస్తారని పేర్కొన్నారు. తనకు అయోధ్య కోసం ఏదైనా చేయాలని ఉన్నదని, రానున్న రోజుల్లో ఏదో ఒకటి చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యేందుకు ఆదివారమే అక్కడికి చేరుకున్నారు పవన్ కల్యాణ్. 500 ఏళ్ల కల సాకారమవుతోందని ఆయన చెప్పారు. నేడు అపూర్వ ఘట్టానికి హాజరయ్యారు. రామమందిరం ముందు సెల్ఫీ దిగిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పవన్. రామ కార్యం అంటే రాజ్య కార్యం, ప్రజాకార్యం.. జై శ్రీరామ్ అని పేర్కొన్నారు. గతంలో రామాలయ నిర్మాణంకు ఆయన రూ 30 లక్షల విరాళం ఇచ్చారు.