ఎట్టకేలకు అంగన్‌వాడీల సమ్మె విరమణ

ఏపీలో 42రోజులుగా సాగుతున్న అంగన్‌వాడీల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం నుంచి విధుల్లో చేరతామని అంగన్‌వాడీలు ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రి వర్గ ఉపసంఘంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించినట్టు ప్రకటించారు. అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది.
సోమవారం సాయంత్రం లోపు విధుల్లో చేరాలని డెడ్ లైన్ విధించింది. లేదంటే ఉద్యోగుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అంగన్‌వాడీలను డ్యూటీ నుంచి తొలగిస్తున్నామని సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఇటువంటి సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణతో అంగన్‌వాడీ ప్రతినిధులు జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయి. 
 
విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృ ష్ణారెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్ వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సమ్మెలో భాగంగా అంగన్ వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు, వాటిలో చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని మంత్రి బొత్స చెప్పారు.
వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం, అటు అంగన్‌వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటూ ఈ ఏడాది జూలై నుంచి అమలు చేసే దిశగా పని చేస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీల ప్రయోజనాలు కాపాడటంతో పాటు వారి సంక్షేమం దృష్ట్యా వర్కర్లకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.50 వేల నుంచి ఏకంగా రూ.1.20 లక్షలకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నామని చెప్పారు.

ప్రమోషన్ల కోసం వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతున్నామని బొత్స చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మినీ అంగన్‌వాడీలను అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు. అంగన్‌వాడీల్లో పని చేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో గ్రాట్యుటీ అంశంపై చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. 

భవిష్యత్తులో అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ నియమిస్తామని ప్రకటించారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్ దృష్టికి నమ్మె కాలంలోని అంగన్‌వాడీల వేతనం, పోలీసు కేసుల అంశం తీసుకెళ్లి  న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. మరోవంక, ప్రభుత్వంతో అంగన్‌వాడీ సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో వామపక్ష నేతలు నిరాహార దీక్షలను విరమించారు. అంగన్‌వాడీలపై రాష్ట్రప్రభుత్వ అమానుష దాడిని నిరసిస్తూ సోమవారం ఉదయం వారు నిరాహార దీక్ష ప్రారంభించారు.