వైసీపీకి మరో ఎంపీ లావు రాజీనామా

వైసీపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా నరసరావు పేట విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో విసిగిపోయిన లావు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.  నరసరావు పేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ అధిష్ఠానం భావించడంతో పార్టీని వీడుతున్నట్లు లావు శ్రీ కృష్ణ దేవరాయులు చెప్పారు.
నరసరావు పేట పార్లమెంటు పరిధిలో రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందని, స్థానికంగా నెలకొన్న అనిశ్చితికి తాను బాధ్యుడిని కానని చెప్పారు. అధిష్టానం వైఖరితో కేడర్ కన్ఫ్యూజ్ అవుతున్నార ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. పార్టీని వీడాలనే నిర్ణయం తాను కోరుకుని చేస్తోంది కాదని, ఈ రకమైన గందరగోళానికి తెరదించాలనే ఉద్దేశంతోనే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
ఐదేళ్లలో తాను చేయగలిగిన అభివృద్ధి పనులు చేశానని, ముఖ్యమంత్రి కూడా తనకు సహకరించారని చెప్పారు.  గత పక్షం రోజులుగా ఎమ్మెల్యేలు తన కోసం తీవ్రంగా ప్రయత్నించారని పేర్కొంటూ  మరోసారి పోటీ చేస్తే నరసరావు పేట నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 2019లో నరసరావు పేట నుంచి ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు గత కొన్నేళ్లుగా స్థానికంగా ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి విడదల రజినితో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. 

పార్టీలో కొందరు నాయకులు తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పినా వాటిని సరిదిద్దే ప్రయత్నాలు జరగకపోవడంతో లావ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరసరావు పేట పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో లావుకు సయోధ్య ఉన్న సోషల్ ఇంజనీరింగ్ పేరుతో వైసీపీ అధిష్టానం ప్రయోగాలు చేస్తోందని లావు అనుచరులు ఆరోపిస్తున్నారు.

నరసరావు పేటలో ఎంపీ అభ్యర్థిని మార్చాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ సారి బీసీ అభ్యర్థిని ఇక్కడ పోటీ చేయించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీని వీడటంతో ఏ పార్టీలోకి వెళతారనేది ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజుల క్రితమే కర్నూలు, మచిలీపట్టణం ఎంపీలు  కూాడా వైసీపీకి రాజీనామా చేశారు. ఒంగోలు ఎంపీ విషయం కూడా డోలాయమానంగా ఉంది.