మల్కాజ్‌గిరి ఎంపీ సీటు ఎందుకంత స్పెషల్

దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమౌతున్న వేళ.. తెలంగాణలోని మల్కాజిగిరి లోక్‌సభ స్థానం అందరి దృష్టినీ మరోసారి ఆకర్షిస్తోంది. సంఖ్యా పరంగా దేశంలోని అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా మల్కాజిగిరి గుర్తింపు పొందటమే దీనికి ప్రధాన కారణం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు.
2019 ఎన్నికల లెక్కల ప్రకారం 31 లక్షల 50 వేల 313 మంది ఓటర్లు ఉన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల నాటికి మల్కాజిగిరి ఓటర్ల సంఖ్య సుమారు 33 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలోని 13 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న మొత్తం జనాభా కంటే మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో ఓటర్లు ఎక్కువ. అంతే కాదు.. ప్రపంచంలోని 60 దేశాల్లో జనాభా కన్నా మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో ఓటర్ల సంఖ్య ఎక్కువ.
మల్కాజిగిరి ఓటర్లలో సుమారు 13 లక్షల మందికి పైగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారే. దీంతో మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని “మినీ ఇండియా”గా అభివర్ణిస్తారు. మల్కాజ్‌‌గిరి లోక్‌సభ స్థానం పరిధిలో మల్కాజ్ గిరి, ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, కంటోన్మెంట్ నియోజక వర్గాలున్నాయి. 2009 డిలిమిటేషన్‌లో భాగంగా మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో 2 సార్లు కాంగ్రెస్, ఓ సారి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు.
 ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోమల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు.
అయితే విభిన్న రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ ఓటర్లుగా ఉండటంతో.. ప్రధాన పార్టీలన్నీ ఈసారి మల్కాజిగిరి లోక్‌సభ స్థానంపై ఫోకస్ పెడెతున్నాయి. బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ మల్లారెడ్డి తనయుడు మహేందర్ రెడ్డి లేదా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.