పాతబస్తీ నుంచే ఏయిర్‌పోర్ట్‌కు మెట్రో

హైదరాబద్ మెట్రో సెకండ్ ఫేజ్ కు రూట్ మ్యాప్ ను ఖరారు చేస్తూ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు.  తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేసేలా కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గాల్లో మెట్రో విస్తరించాలనే ప్రభుత్వ ఆలోచనకు తగ్గట్టుగా.. రూట్ మ్యాప్ ను రూపొందించారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ కింద మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైలు మార్గాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు పూర్తయ్యాయి.
ఈ రెండో దశ విస్తరణలో భాగంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రో రైలు మార్గాన్ని చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్ వరకు పొడిగించనున్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్లు.. ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్ వరకు 1.5 కిలోమీటర్లు కొత్తగా మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు. నాలుగో కారిడార్‌లో భాగంగా నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు పొడగించనున్నారు.
అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్, మైలార్‌దేవ్‌పల్లి, పీ 7 రోడ్‌ను కలుపుతూ శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మొత్తం 29 కిలోమీటర్ల పొడవునా ఇంకో రూట్ నిర్మించనున్నారు. ఇది ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి వద్ద నిర్మించనున్న హైకోర్టు వరకు మరో 4 కిలోమీటర్ల పాటు విస్తరించనున్నారు. ఇక కారిడార్ 5 లో భాగంగా రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్‌రాంగూడ జంక్షన్, విప్రో జంక్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అమెరికా కాన్సులేట్ వరకు మరో 8 కిలోమీటర్ల పాటు కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు.
ఇటు కారిడార్ 6 లో భాగంగా.. మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు 14 కిలోమీటర్ల పాటు పొడగించనున్నారు. అలాగే కారిడార్ 7 లో భాగాగా ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్‌నగర్ వరకు 8 కిలోమీటర్ల పొడవునా విజయవాడ మార్గంలో మరో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. రెండో దశ కింద మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు తయారు చేశారు.