అయోధ్యకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే ప్రకటించింది. ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట నుంచి అయోధ్యకు దక్షిణ మధ్య రైల్వే నడుపనున్నది.  విజయవాడ నుంచి ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్ల మీదుగా అయోధ్యకు రైళ్లు వెళ్లనున్నాయి.
తెలంగాణ నుంచి సికింద్రాబాద్‌, కాజీపేట నుంచి అయోధ్యకు రైళ్లు వెళ్లనున్నాయి. సికింద్రాబాద్, నుంచి జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బల్హర్షా తదితర ప్రాంతాల మీదుగా రైళ్లు రాపోకలు సాగిస్తాయని అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ నుంచి ఈ నెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో రైలు నడువనున్నది.

ఆయా రోజుల్లో రైలు సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి వెళ్తుంది. అయోధ్య నుంచి ఈ నెల 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఆయా రోజుల్లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.  ఏపీలో గుంటూరు నుంచి ఈ నెల 31న, విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, రాజ‌మండ్రి నుంచి ఫిబ్రవరి 7న, సామర్లకోట నుంచి ఫిబ్రవరి 11న ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

మరోవైపు తెలంగాణ నుంచి జనవరి 29 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. తెలంగాణలోని ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 200 మంది చొప్పున అయోధ్య యాత్ర చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో 20 బోగీలుంటాయి.. ఒక్కో రైలులో 1,400 మంది ప్రయాణించవచ్చు. అయోధ్యకి వెళ్లి రావడానికి 5 రోజుల సమయం పడుతుంది.

సికింద్రాబాద్, కాజీపేట రైల్వే స్టేషన్ల నుంచి ఈ రైళ్లు బయలుదేరనున్నాయి. సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, మెదక్ పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన భక్తులు సికింద్రాబాద్‌లో రైలు ఎక్కాల్సి ఉంటుంది. నల్గొండ, వరంగల్, మహబూబాబాద్‌, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, నియోజకవర్గాలకు చెందిన వారు కాజీపేటలో రైలు ఎక్కాల్సి ఉంటుంది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.