మూసీ తలరాత ఇప్పటికైనా మారుతుందా..?

నగరం నడిబొడ్డు నుంచి కృష్ణానదిలో కలిసే మూసీని బాగు చేయడం.. అధికారంలోకొచ్చిన ప్రతి పార్టీ తక్షణ కర్తవ్యంగా వస్తూనే ఉంటుంది. కానీ.. దాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవరూ బాగు చేయలేకపోయారు. ఈ సారి కూడా అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూసీ ప్రక్షాళనపై యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభిస్తామని చెబుతోంది. మరి మూసీ తలరాత మారుతుందా..?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన బృంధంతో కలిసి.. దావోస్ పర్యటనలో భాగంగా లండన్, దుబాయ్ లను కూడా చుట్టొచ్చారు. ఈ సందర్భంగా లండన్ లోని థేమ్స్ రివర్ ఫ్రంట్ టీమ్ ను కలిశారు. థేమ్స్ నది తీరాన్ని అభివృద్ధి చేసిన విధానాన్ని అధ్యయనం చేశారు. అలాగే ఆ తర్వాత దుబాయ్ లోని వాటర్ ఫ్రంట్ ను సందర్శించారు. దాదాపు 70 సంస్థల ప్రతినిధులను కలిసి అక్కడ జరిగిన అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు.
ప్రపంచ స్థాయి పట్టణ ప్రణాళిక నిపుణులు, డిజైనర్లు, పలు సంస్థల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యారు. ఈ కీలక సమావేశాల్లో హైదరాబాద్‌ మహానగరంలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డిజైన్లు, అభివృద్ధిపై సమాలోచనలు చేశారు. అయితే ఈ చర్చల్లో పాల్గొన్న దాదాపు అన్ని సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం, హైదరాబాద్‌లో మూసీ అభివృద్ధి, సుందరీకరణ పనులపై ఆసక్తి ప్రదర్శించాయి.
సుమారు 56 కిలోమీటర్ల పొడవునా.. మూసీ రివర్‌ ఫ్రంట్‌, గ్రీన్‌ అర్బన్‌ పార్క్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలు, వాటికి అవసరమైన పెట్టుబడులపై కూడా ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా మూసీ సుందరీకరణ తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని.. రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ మూసీ రివర్‌ ఫ్రంట్‌ నిర్మించే యోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగానే చర్చలు ఫలప్రదమైనట్లు తెలిపారు.
దీంట్లో భాగంగా మూసీ నది నీటిని ముందుగా స్వచ్చంగా ఉంచడంతో పాటు.. పరీవాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, వాణిజ్య సముదాయాలను నిర్మించడం వంటి అంశాల్లో తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం.. మూసీ ప్రక్షాళన దిశగా ముందుడుగు మంచిదే అయినా.. ఆచరణలో ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. హుస్సెన్ సాగర్ విషయంలో కూడా గత ప్రభుత్వం ఏదో చేస్తామని కోట్లు ఖర్చు చేసి చేతులెత్తేసింది.