
7 వేల మందికి పైగా విశిష్ట అతిధులతో పాటు అయిదు నుంచి ఎనిమిది లక్షల మంది భక్తులు హాజరవుతున్న కారణంగా అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆకాశం నుంచి భూమి వరకు కట్టుదిట్టమైన నిఘా, భద్రతా ఏర్పాట్లు చేశారు. పైన డ్రోన్ల నుండి భద్రతా పర్యవేక్షణ చేయనున్నారు. అయోధ్య సిటీ వ్యాప్తంగా 10 వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో 400 కెమెరాలు రామమందిరం పరిసరాలతో పాటు ఎల్లో జోన్‌లో ఏర్పాటు చేశారు.
ఈ ఎల్లో జోన్‌లో మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నామని ఉత్తరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. నేరస్థులను గుర్తించడానికి, సరిపోల్చడానికి యూపీ క్రిమినల్ డేటాబేస్‌ను పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. వీటితో పాటూ ప్రత్యేక శిక్షణ పొందిన భద్రతా సిబ్బందిని కూడా పెద్ద సంఖ్యలో మోహరించనున్నారు. వీరి దగ్గర ఆటోమేటిక్ ఆయుధాలుంటాయని చెబుతున్నారు.
ఎస్ పి జి నుండి ఎటిఎస్ వరకు ప్రత్యేక కమాండోలను తీసుకురానున్నారు. వైమానిక దాడిని ఎదుర్కోవటానికి యాంటీ- డ్రోన్ సిస్టమ్‌ల నుండి కృత్రిమ మేధస్సుతో కూడిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ల వరకు అన్నిటినీ ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి సంరక్షణ కోసం 24 గంటలపాటు సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 6 కంపెనీలు, పీఏసీకి చెందిన మూడు కంపెనీలు, ఎస్‌ఎస్‌ఎఫ్‌కు చెందిన తొమ్మిది కంపెనీలు, ఏటీఎస్, ఎస్‌టీఎఫ్‌కు చెందిన ఒక్కో యూనిట్‌ను పెట్టినట్టు ఎస్పీ ప్రవీణ్‌రంజన్ తెలిపారు.
వీరితో పాటు 300 మంది పోలీసులు, 47 మంది అగ్నిమాపక సిబ్బంది, 40 మంది రేడియో పోలీసు సిబ్బంది, 37 మంది లోకల్ ఇంటెలిజెన్స్, 2 బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ టీమ్‌లు, 2 యాంటీ సెబోటేజ్ స్క్వాడ్ టీమ్‌లను రప్పిస్తున్నారు. ఆలయానికి వెళ్లే అన్ని రహదారులు, కూడళ్లలో వారిని మోహరిస్తారు.
ప్రాణ ప్రతిష్ట చేయడానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ముగ్గురు డీఐజీలు, 17 మంది ఎస్పీలు, 40 మంది ఏఎస్పీలు, 82 మంది డీఎస్పీలు, 90 మంది ఇన్‌స్పెక్టర్లతో పాటు 1000 మందికి పైగా కానిస్టేబుళ్లు, 4 కంపెనీ పీఏసీలు పీఎం సెక్యూరిటీ సర్కిల్‌లో పెట్టనున్నారు.
వీటన్నిటితో పాటూ స్నిపర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సరయూ నది ఒడ్డున స్నిపర్‌లను పెట్టనున్నట్లు ఉత్తరప్రదేశ్ డీజీ ప్రశాంత్త్ కుమార్ తెలిపారు. అయోధ్యలో ఇంతకు ముందెప్పుడూ ఇంత పెద్ద కార్యక్రమం జరగలేదని, ఇప్పుడు జరిగేది దేశ చరిత్రలో నిలిచిపోయేదని అందుకే ఇంతలా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు.
More Stories
ఉగ్రదాడి సాకుతో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా అడగను
గాయని నేహా రాథోడ్‌పై దేశద్రోహం కేసు
పాతబస్తీలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు