తీర్పు చెప్పిన న్యాయమూర్తులకు అయోధ్య ఆహ్వానాలు

జ‌న‌వ‌రి 22వ తేదీన‌ ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా కొన‌సాగ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ఇప్ప‌టికే దేశంలోని రాజ‌కీయ‌, పారిశ్రామిక‌, సినీ, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ఆహ్వానాలు పంపింది. శ్రీరామ జ‌న్మ‌భూమి ట్ర‌స్టు స‌భ్యులు ప్ర‌ముఖుల నివాసాల‌కు వెళ్లి ఆహ్వానించారు.
 
ఈ మ‌హోత్త‌ర వేడుక‌కు దాదాపు 8 వేల మంది ప్ర‌ముఖులు హాజ‌రయ్యే అవ‌కాశం ఉంది. ఈ అథితుల జాబితాలో ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు, పారిశ్రామిక‌వేత్త‌లు, సినీ ప్ర‌ముఖులు, క్రీడాకారులు, బ్యూరోక్రాట్లు, దౌత్య‌వేత్త‌లు ఉన్నారు.  దశాబ్దాలపాటు ఎటూ తేలని వివాదానికి ఒక్క తీర్పుతో పరిష్కారం చూపిన అప్పటి న్యాయమూర్తులకు రామ జన్మ భూమి నుంచి ఆహ్వానం అందింది.
ఏళ్లుగా నానుతూ వచ్చిన అయోధ్య రామ మందిరం – బాబ్రీ మసీదు కేసులో నవంబర్ 9, 2019న అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం చారిత్రక తీర్పునిచ్చింది.  అయోధ్యలోని వివాదాస్పద భూమి రాముడికే చెందుతుందని.. మసీదు నిర్మాణానికి అదే నగరంలో వేరే ప్రాంతంలో 5 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
తీర్పు వచ్చిన వెంటనే అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం నిర్మాణాలు వేగంగా పూర్తి కావడంతో జనవరి 22న శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  తీర్పు వెలువరించిన వారిలో ప్రస్తుత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తోపాటు మాజీ సీజేఐలు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వీరికి ఆలయ ట్రస్టు సభ్యులు ఆహ్వానాలు పంపారు.
 
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పంపిన ఆహ్వానితుల జాబితాలో ‘రామ్ లల్లా’ తరఫున వాదించిన న్యాయవాది పరాశరన్‌ సహా 50 మంది న్యాయనిపుణులు కూడా ఉన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కి సైతం ఆహ్వానాలు వెళ్లాయి.  సినీ పరిశ్రమ నుంచి అజ‌య్ దేవ‌గ‌న్‌, అక్ష‌య్ కుమార్, అల్లు అర్జున్, మోహ‌న్ లాల్, అనుప‌మ్ ఖేర్, చిరంజీవి, అంజ‌ద్ అలీ, మ‌నోజ్ ముంతాషీర్, ప్ర‌సూన్ జోషి, డైరెక్ట‌ర్లు సంజ‌య్ భ‌న్సాల్, చంద్ర‌ప్ర‌కాశ్ ద్వివేదితో పాటు ప‌లువురు ఉన్నారు.

పారిశ్రామిక‌వేత్త‌లు ముకేశ్ అంబానీ, ఆయ‌న త‌ల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కోడ‌లు శ్లోకా, కాబోయే మ‌రో కోడ‌లు రాధిక మ‌ర్చంట్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్‌ప‌ర్స‌న్ కుమార్ మంగ‌ళం బిర్లా, ఆయ‌న భార్య నీర‌జ‌, పిర‌మ‌ల్ గ్రూప్ చైర్‌ప‌ర్స‌న్ అజ‌య్ పిర‌మ‌ల్, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా చైర్‌ప‌ర్స‌న్ ఆనంద్ మ‌హీంద్రా, డీసీఎం శియారాం అధినేత అజ‌య్ శియారాం, టీసీఎస్ సీఈవో కే కృతివ‌స‌న్ హాజ‌రు కానున్నారు.

డాక్ట‌ర్ రెడ్డీస్ ఫార్మాస్యూటిక‌ల్స్ నుంచి కే స‌తీశ్ రెడ్డి, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ సీఈవో పునీత్ గోయెంకా, ఎల్ అండ్ టీ సీఈవో ఎస్ఎన్ సుబ్ర‌మ‌ణ్య‌న్, ఆయ‌న భార్య దురాలి దివి, ఇన్ఫోసిస్ ఫౌండ‌ర్ ఎన్ఆర్ నారాయ‌ణ మూర్తి, జిందాల్ స్టీల్ అండ్ ప‌వ‌ర్ హెడ్ న‌వీన్ జిందాల్, మేదాంత గ్రూప్ చైర్మ‌న్ న‌రేశ్ త్రెహాన్ ఉన్నారు. లోక్‌స‌భ మాజీ స్పీక‌ర్ మీరా కుమార్, ప్లానింగ్ క‌మిష‌న్ మాజీ డిప్యూటీ చైర్మ‌న్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా హాజ‌రు కానున్నారు.