కాంగ్రెస్ లో అయోధ్య దుమారం … ఎమ్యెల్యే రాజీనామా

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించడం ఆ పార్టీలో అంతర్గతంగా దుమారం రేపుతోంది. పలువురు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే ఈ నిర్ణయం పట్ల తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ వైఖరి నచ్చక గుజరాత్‌ లోపార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే సీజే చావ్దా ఏకంగా తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ శంకర్‌ చౌధరికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 
 
అదేవిధంగా పార్టీ నుంచి కూడా నిష్క్రమించారు. అనంతరం మాట్లాడుతూ  తాను కాంగ్రెస్‌ పార్టీలో 25 ఏండ్లపాటు కొనసాగానని, నేడు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుండటంతో దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, వేడుక జరుపుకుంటున్నారని ఆయన చెప్పారు. 
 
రాముల వారు ఎప్పుడు కోలువుదీరుతారా? అని అంతా ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. కానీ వేడుకలకు ఆ పార్టీ ఎందుకు దూరంగా ఉంటుందనే విషయం తనకు అర్థంకాలేదని అంటూ విస్మయం వ్యక్తం చేశారు. పైగా,  గుజరాతీలుగా ప్రధాని మోదీ, హోమంత్రం అమిత్‌ షా చేసే పనులకు తాము మద్దతుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. 
 
 అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఉండటం వల్ల తాము ఆ పని చేయలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. కాగా, చవ్దా రాజీనామాతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలం 15కు పడిపోయింది. ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆయన ఆనంద్‌ జిల్లాలోని ఖంబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.