భారీ ప్రక్షాళన దిశగా తెలంగాణ బీజేపీ

తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు దక్కించుకోవాలని భావిస్తోన్న బీజేపీ నాయకత్వం సీరియస్ గా ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినంత కాకున్నా.. మెరుగైన ఫలితాలు రాబట్టుకున్న కాషాయ పార్టీ.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 10 స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఓ వైపు పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేస్తూనే.. మరోవైపు అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఈ అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ముందుగా పెద్ద సంఖ్యలో జిల్లాల అధ్యక్షులను, వివిధ మోర్చాల అధ్యక్షులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 12 జిల్లాల అధ్యక్షులను మారుస్తూ.. కిషన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. 5 మోర్చాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సహకరించలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై వేటు పడింది.

అంతేకాకుండా సుదీర్ఘకాలం పదవిలో ఉంటున్న వారిని కూడా స్థానం చలనం చేశారు. నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నారాయణపేట, పెద్దపల్లి, వరంగల్‌, ములుగు, యాదాద్రి- భువనగిరి జిల్లాల అధ్యక్షులను మారుస్తూ.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, భూపాలపల్లి జిల్లాల అధ్యక్షులను మార్చే ప్రక్రియను పెండింగ్‌లో పెట్టారు. వీటితో పాటే.. 5 మోర్చాలకు కూడా అధ్యక్షులను మార్చారు. ఎస్టీ మోర్చా- డాక్టర్‌ జె.గోపి, ఎస్సీ మోర్చా- కొండేటి శ్రీధర్‌, యువ మోర్చా-సెవెళ్ల మహేందర్‌, ఓబీసీ మోర్చా- ఆనంద్‌గౌడ్‌, మహిళా మోర్చా-డాక్టర్‌ శిల్ప ను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్పటికే ఉన్న 4 లోక్ సభ స్థానాల్లో సిట్టింగులకే అవకాశం ఇస్తున్నట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అర్వింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు.. ఆయా స్థానాల్లోనే మరోసారి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక మిగతాస్థానాల్లో ఎవరెవరు బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.