ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం

గత ఏడాది నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారం తాజాగా కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. 
 
కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలో ఈ ఐదుగురు సభ్యుల ఎస్సీ వర్గీకరణ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  ఈ ఐదుగురు సభ్యుల కమిటీలో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా అధ్యక్షుడిగా ఉండగా సభ్యులుగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, గిరిజన శాఖ కార్యదర్శి, సామాజిక న్యాయ శాఖ కార్యదర్శులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 
 
అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీంకోర్టు గతంలోనే అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఐదుగురు సభ్యుల ఎస్సీ వర్గీకరణ కమిటీ ఈనెల 23 వ తేదీన తొలిసారి భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ సమయంలో ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ సభలో ప్రధాని మోదీ స్పష్టం చేశారు.