విజయవాడలో మరో మణిహారం డా. అంబేద్కర్ స్మృతివనం

విజయవాడలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించబోయే 125 అడుగుల అంబేద్కర్  విగ్రహంతో ఇకపై బెజవాడకు ప్రత్యేక గుర్తింపు లభించనుంది.  ‘సామాజిక న్యాయ మహా శిల్పం’  (స్టాచ్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌) పెరిగే అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని సందర్శనీయ స్థలంగా తీర్చిదిద్దారు.  విజయవాడ బందర్ రోడ్డులో 81 అడుగుల ఎత్తైన పీఠంపై ఈ భారీ విగ్రహాన్ని నిర్మించారు. 
స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాటాలకు వేదికైన స్వరాజ్య మైదానాన్ని ఇకపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌గా పరిగణిస్తారు.  దీని మొత్తం ఎత్తు 206 అడుగులు ఉంటుంది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా చెప్పాలి. 18.81 ఎకరాల్లో స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 9 ఎకరాల్లో పూర్తిగా పచ్చదనాన్ని నింపారు.
యాంఫీ థియేటర్‌, మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. లైబ్రరీతో పాటు ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.  కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేయించారు. దాన్ని భాగాలుగా విజయవాడకు తరలించి స్మృతివనంలో క్రమ పద్ధతిలో అతికించి అద్భుతంగా తీర్చిదిద్దారు. విగ్రహం తయారీలో షూ దగ్గర్నుంచి బెల్ట్‌ వరకు హనుమాన్‌ జంక్షన్‌ వద్ద శిల్పి ప్రసాద్‌ ఆధ్వర్యంలో కాస్టింగ్‌ చేశారు.
 
గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లుండగా ఒక్కోటి నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. అందులో ఒకటి సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్రను తెలిపే డిజిటల్‌ మ్యూజియం ఉంటుంది. అంబేద్కర్‌ విగ్రహావిష్కరణతో పాటు సామాజిక సమతా సంకల్ప సభకు సంబంధించిన పోస్టర్‌ను వైసీపీ నేతలు విజయవాడలో విడుదల చేశారు.

భావితరాలకు అంబేడ్కర్‌ ఆదర్శాలు, ఆలోచనలను అందించే గొప్ప ప్రయత్నమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టింది. దీని కోసం 18ఎకరాల ఇరిగేషన్ స్థలాన్ని ఆ శాఖకు బదలాయించారు.  స్మృతి వనం నిర్మాణాన్ని ఏపీ ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టారు. రూ.170 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.404.35 కోట్లకు చేరింది.