పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్‌ దాడి

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పాకిస్థాన్‌లోని జైష్-అల్-అదల్‌ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం దాడి చేసినట్లు తెలిపింది. ఈ దాడికి ఇరాన్ క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించింది. జైష్‌ అల్‌ అదిల్‌ అనే ఉగ్ర సంస్థకు చెందిన 2 ప్రధాన కార్యాలయాలపై దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది.
ఈ దాడుల్లో జైష్ అల్ అదిల్ రెండు స్థావరాలు ధ్వంసమైనట్లు పేర్కొంది. అయితే ఇంతకు ముందు బలూచిస్థాన్ కేంద్రంగా ఉన్న జైషే అల్ అదిల్ మిలిటెంట్లు తమ భద్రతా బలగాలపై దాడి చేశారని ఇరాన్ ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే బలూచిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసినట్లు సమాచారం.
 
అయితే ఇరాన్‌ దాడులను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడిలో ఇద్దరు అమాయక పిల్లలు చనిపోయారని, మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని వెల్లడించింది. ఇది పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, ఈ దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది.
 
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్లకు మధ్య జరుగుతున్న యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉన్న క్రమంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. మరోవైపు సోమవారం ఇరాకీ నగరం ఇర్బిల్‌లోని యుఎస్ కాన్సులర్ కాంపౌండ్‌కు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ గూఢచారి ప్రధాన కార్యాలయం, తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధం ఉన్న లక్ష్యాలపై కూడా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. 
 
ఇరాన్‌ దాడికి ఇరాక్‌ కూడా ఖండించింది. ఇరాక్ సార్వభౌమాధికారానికి ఈ దాడి భంగకరమని, దాడిలో అనేక మంది అమాయక పౌరులు మరణించారని తెలిపింది.  ఇరాక్, సిరియాల్లో మకాం వేసిన రివాల్యూషనరీ గార్డ్స్ శిబిరాలపై రెండు రోజుల కిందటే వైమానిక దాడులను చేపట్టింది ఇరాన్. ఇప్పుడు తాజాగా తన దిశను మార్చింది. పాకిస్తాన్‌పై అస్త్రాలను ఎక్కుపెట్టింది. 
 
పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది. దీన్ని సర్జికల్ స్ట్రైక్స్‌గా పేర్కొంది. పాకిస్తాన్ భూభాగంపై గల బలూచిస్తాన్ ప్రాంతంలోని సిస్టాన్‌పై ప్రధానంగా ఇరాన్ దాడులు సాగాయి. ఆఫ్ఘనిస్తాన్- ఇరాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుందీ టౌన్. జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థకు కేంద్రబిందువుగా చెబుతుంటారు. 
 
సున్ని మిలిటెంట్ల ఆధీనంలో ఈ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను సాగిస్తోంది. 2012లో ఇది ఏర్పాటైంది. ఇరాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలుు, ఆ దేశ సైన్యంపై తరచూ దాడులకు పాల్పడుతుంటుందనే పేరుంది జైష్ అల్ అదిల్ సంస్థకు. గత ఏడాది డిసెంబర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 11 మంది పోలీసులు మరణించారు. 
 
ఈ దాడులకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని అప్పట్లో ఇరాన్ హెచ్చరించింది కూడా. దీనికి అనుగుణంగా ఈ ఉగ్రవాద సంస్థ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. డ్రోన్లతో బాంబుల వర్షాన్ని కురిపించింది. మిస్సైళ్లను సంధించింది. ఈ ఘటనతో సిస్టాన్- బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే, సిస్టాన్ ప్రాంతం తమ భూభాగంపై లేదని,  ఈ విషయంపై ఇప్పటికే ఇరాన్‌కు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదం అన్ని దేశాలకూ తీవ్ర ముప్పేనని పేర్కొన్న పాకిస్థాన్.. దాన్ని అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. కానీ ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచలేదని వ్యాఖ్యానించింది. దీని వల్ల రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక బంధం తీవ్రంగా దెబ్బతినేలా ఇరాన్ చేసిందని పాక్‌ మండిపడింది.