తెలంగాణ‌లో అదానీ గ్రూపు రూ. 12,400 కోట్ల పెట్టుబ‌డి

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో  ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతం అదానీ, టాటాసన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్ ల‌తో ఆయన సమావేశమై  తెలంగాణ‌లో పెట్టుబ‌డి అవ‌కాశాల‌ను వారికి వివ‌రించారు.
 
అదానీ గ్రూపు సంస్థ తెలంగాణ‌లో సుమారు రూ.12,400 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ది. డేటా సెంట‌ర్‌, క్లీన్ ఎన‌ర్జీ ప్రాజెక్టు, సిమెంట్ ప్లాంట్ కోసం ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయ‌నున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదానీ గ్రూపు చైర్మెన్ గౌత‌మ్ అదానీ మ‌ధ్య నాలుగు ఒప్పందాల‌పై సంత‌కాలు చేశారు. 
 
100 ఎండ‌బ్ల్యూ డేటా సెంట‌ర్ కోసం అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ సుమారు రూ.5వేల కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ది. అంబుజా సిమెంట్స్ సంస్థ రూ.1400 కోట్ల‌తో ఏడాదికి ఆరు మిలియ‌న్ల ట‌న్నుల సిమెంట్‌ను ఉత్ప‌త్తి చేసేందుకు ప్లాన్ చేసింది. అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్ వద్ద కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ మరియు క్షిపణి అభివృద్ధి కేంద్రాలు రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

తెలంగాణలో 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. చందనవెల్లిలో రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది.

ఇది ఇలా ఉంటే ఈ నెల ప్రారంభంలో పోర్ట్స్-సెజ్ సీఈవో, గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదానీ ఏరో స్పేస్ సీఈవో ఆశిష్ రాజ్ వంశీ సచివాలయంలో సీఏ రేవంత్ రెడ్డిని కలిశారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు తగిన సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చారు. 

కాగాజేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌, గ్లోబల్‌ హెల్త్‌ స్ట్రాటజీ వైస్‌ ప్రెసిడెంట్‌ విలియం వార్‌, వీఆర్‌ఎల్‌డీసీ ప్రతినిధులను కూడా రేవంత్ రెడ్డి కలిశారు. ఐటి రంగంలో హైద‌రాబాద్ అగ్ర‌గామిగా దూసుకుపోతున్న విష‌యాన్ని రేవంత్ ఈ ప్ర‌తినిధుల‌కు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చేసి చూపారు..