భద్రాద్రి నుంచి అయోధ్యకు శ్రీరామ రథయాత్ర

యోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు భద్రాచలం శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానం నుంచి ముత్యాల తలంబ్రాలను కానుకగా తీసుకొని శ్రీరామ రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్రను కేంద్ర మంత్రి బీఎల్‌ వర్మ మంగళవారం ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ముందుగా కేంద్ర మంత్రి బీఎల్‌ వర్మ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు రంగాకిరణ్‌, యాత్ర రూపకర్త, ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్‌ నంబూరి రామలింగేశ్వరరావులు భద్రాద్రి రామయ్య మూలవరుల సన్నిధిలో రామానుజలువారి విగ్రహాన్ని, ముత్యాల తలంబ్రాలను ఉంచి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
 
తరువాత లక్ష్మీతాయారు ఆలయంలో సైతం పూజలు నిర్వహంచారు. అనంతరం కేంద్ర మంత్రి బీఎల్‌ వర్మ శ్రీరామ రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అయోధ్యలో ఐదు శతాబ్దాల తర్వాత శ్రీరామ మందిరం ప్రతిష్ఠ జరుగుతోందని గుర్తు చేశారు. 
 
 ఈ క్రమంలో దక్షిణ నియోజకవర్గంగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడం పుణ్యప్రదంగా భావిస్తున్నానని తెలిపారు. భద్రాద్రి రామయ్య సన్నిధి నుంచి ముత్యాల తలంబ్రాలు అయోధ్యకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభించడం అదృష్టమని పేర్కొన్నారు.