లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే మాయావతి

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్ ఒంటరిగానే పోటీచేస్తుందని యూపీ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, ఏ కూటమిలో చేరిది లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత పొత్తు కుదుర్చుకునే ఆప్షన్‌ తమవద్ద ఉందని ఆమె చెప్పారు. 
 
ఉత్తరప్రదేశ్‌లోమరో పార్టీతో కలిసి పోటీచేసిన ప్రతిసారీ తాము నష్టపోయామని ఆమె తెలిల్పారు. తమతో పొత్తువల్ల భాగస్వామ్య పార్టీకే లాభం జరిగిందని తెలిపారు. తన 68వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పొత్తులో భాగంగా తమ పార్టీ కార్యకర్తల ఓట్లు సక్రమంగా బదిలీ అవుతున్నప్పటికీ, అవతలివైపు నుంచి అలా జరగడంలేదని ఆమె వెల్లడించారు. 
 
అందువల్ల ఎన్నికల తర్వాత పొత్తుల అంశంపై ఆలోచిస్తామని తెలిపారు. ఇప్పట్లో రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనేదీ తనకు లేదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర రంగాల్లో ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల పరిస్థితి దయనీయంగా ఉందని చెబుతూ తన జీవితమంతా వారి శ్రేయస్సుకే అంకితం చేశానని మాయావతి వెల్లడించారు. 
 
చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటానని, వెనుకబడిన వారి కోసం పని చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గతంలో సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీలతో  ఆమె పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.