శబరిమలలో కనిపించిన మకరజ్యోతి

అయ్యప్ప నామస్మరణతో శబరిమల పులకించింది. మకరజ్యోతి దర్శనం చేసుకున్న భక్తుల శరణుఘోషతో శబరిగిరి పులకించింది. జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. శబరిమలకు 4 కిలోమీటర్ల దూరంలోని పొన్నంబలమేడుకు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య మకర జ్యోతి కనిపించింది.
సోమవారం సాయంత్రం 6 గంటల 50 నిమిషాల సమయంలో పొన్నాంబలమేడు నుంచి మకర జ్యోతి మూడుసార్లు దర్శనం ఇచ్చింది. మహా హారతి అనంతరం.. మకర జ్యోతి కనిపించింది. దీంతో అయ్యప్ప భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి.
మకర జ్యోతిని అయ్యప్ప స్వామి దివ్య స్వరూపంగా విశ్వసించే అయ్యప్ప భక్తులు.. జ్యోతి ప్రత్యక్ష దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల చేరుకున్నారు. దాదాపు 4 లక్షల మంది భక్తులు మకర జ్యోతి దర్శనంతో పులకించారు. మకర జ్యోతి వీక్షణ కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం 50 చోట్ల వ్యూ పాయింట్లను ఏర్పాటు చేసింది.
 
 జ్యోతి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్న అయ్యప్పమాల ధరించిన భక్తులతోపాటు అనేక మంది తరలి వెళ్లారు.
మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం వల్ల భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో మకర జ్యోతి దర్శనం కోసం ప్రతి ఏడాదిలాగే శబరిమలకు భక్తజనం పోటెత్తారు. 
 
భారీగా భక్తులు తరలిరావడంతో మకర జ్యోతి దర్శనం కోసం పంబా, సన్నిధానం, పులిమేడ్‌, నీలికల్‌ ప్రాంతాల్లో ట్రావెన్‌కోర్‌ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం కావడంతో అయ్యప్ప భక్తులు భక్తిపారవశ్యంలో మునిగి పోయారు. అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరి మార్మోగిపోయింది.
 
మకరజ్యోతి దర్శనం కోసం లక్ష మంది భక్తులు తరలి వస్తుండటంతో పులిమేడు, పరుంతుంపర, పాంచాలిమేడులో కూడా దర్శన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రాంతాల్లో ఎనిమిది మంది డీఎస్పీల ఆధ్వర్యంలో 1400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మకర జ్యోతి దక్షిణాది ప్రజలలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. మకరజ్యోతిని దర్శించుకుంటే అదృష్టం, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుందని ఎక్కువ మంది నమ్ముతారు.
అయ్యప్ప దీక్ష చేపట్టే భక్తులు మకర జ్యోతి దర్శనం కోసం తహతహలాడుతారు. నలభై ఒక్క రోజులపాటు మండల దీక్ష చేపట్టిన అనంతరం ఇరుముడితో శబరిమల చేరుకొని.. పంబా నదిలో స్నానం చేసి.. స్వామికి ఇరుముడి సమర్పించి.. మకర జ్యోతిని దర్శించుకుంటారు. మకర జ్యోతి దర్శనంతో తమ జీవితం ధన్యమైందని అయ్యప్ప భక్తులు భావిస్తారు.

గతంతో పోలిస్తే ఈసారి శబరిమలకు అయ్యప్ప భక్తుల రాక పెరిగింది. దీంతో భక్తులు భారీ సంఖ్యలో క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. అయ్యప్ప దర్శనానికి 15 గంటలకుపైగా సమయం పట్టింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొందరు భక్తులైతే స్వామి వారిని దర్శించుకోకుండానే తిరుగుముఖం పట్టారు. స్వామి మాలధారణ చేసిన చిన్నారులకు వేగంగా దర్శనం పూర్తయ్యేలా దేవస్థానం అనుమతి ఇచ్చింది.