
తమకు బందీలుగా చిక్కిన వారిలో చాలామంది గాజాలో చనిపోయి ఉండొచ్చని హమాస్ అధికార ప్రతినిధి అబు ఒబేదా విడుదల చేసిన మరో సందేశంలో వెల్లడించారు. దీనికి ఇజ్రాయెల్ పూర్తి బాధ్యతవహించాలని చెప్పాడు. వారి సైనిక చర్యల వల్లే ఇదంతా జరిగిందని తెలిపాడు. ఇప్పటికీ సొరంగాల్లో ఉన్న బందీలకు ముప్పు పొంచి ఉందన్నాడు.
ఇజ్రాయెల్ దాడులు విస్తరించే కొద్దీ వారు మరింత ప్రమాదంలోకి జారుకుంటారని హెచ్చరించాడు. గాజా భవిష్యత్తులో హమాస్‌ను లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రతినబూనగా, అది భ్రమేనని హమాస్ అంటున్నది. ఇజ్రాయెల్ ఏర్పాటైన 1948 నుంచి ఇంత సుదీర్ఘకాల, విధ్వంసకర యుద్ధం ఇదే.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై రాకెట్లతో విరుకుపడిన హమాస్ మొత్తం 240 మందిని బందీలుగా తీసుకున్నది. అయితే ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందంలో భాగంగా నవంబర్‌లో కొంతమందిని వదిలేసింది. ఇంకా 132 మంది హమాస్ వద్ద బందీలుగానే ఉన్నారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. మరో 25 మంది కాల్పుల్లో మరణించారని తెలిపింది.
హమాస్ రాకెట్ దాడులపై తీవ్రస్థాయిలో స్పందించిన ఇజ్రాయెల్ సైన్యం అనంతరం పెద్దయెత్తున బాంబు దాడులతో గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఫలితంగా ఇప్పటి వరకు దాదాపు 23 వేల మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ చెబుతున్నది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ వైపు కూడా దాదాపు 1200 మంది మరణించగా, 80 శాతం మంది గాజా జనాభా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధనంతో గాజా ప్రజలు ఆహారం, తాగు నీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే గాజా నివాసయోగ్యం కానిదిగా మారిపోయిందని యూఎన్ మానవతా గ్రూప్ చీఫ్ మార్టిన్ పేర్కొన్నారు. హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రాజేసింది. హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా గ్రూపు కూడా ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే.
మరోవైపు ఇరాన్ మద్దతు గల యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. దాడులను ఆపాలని అమెరికా, మిత్రదేశాలు హౌతీలను హెచ్చరించాయి. వాటిని హౌతీలు పట్టించుకోకపోవడంతో అమెరికా, బ్రిటన్ శుక్రవారం యెమెన్‌లోని హౌతీ సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడులకు దిగిన విషయం తెలిసిందే.
More Stories
ఉగ్రదాడి సాకుతో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా అడగను
గాయని నేహా రాథోడ్‌పై దేశద్రోహం కేసు
పాతబస్తీలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు